
వరలక్ష్మి వ్రతం స్త్రీలు జరుపుకునే అరుదైన పండుగలలో ఒకటి. ఈ రోజున మహిళలు శ్రేయస్సు, సంపదను అందించే లక్ష్మీ దేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం వరలక్ష్మీవ్రతం జరుపుకునేందుకు పుజ్యనీయమైనవే.. అయితే ఈ నెలలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. విశిష్టమైన రోజుగా భావించి శ్రీ మహా విష్ణు భార్య మహా లక్ష్మిని వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. వివాహిత మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి చేసే పూజ అష్టలక్ష్మీ పూజలకు సమానం అని నమ్మకం. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండడం వలన అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని విశ్వాసం. ఈ నేపధ్యంలో మహిళలకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మీవ్రతం ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం సమయంలో లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ వ్రతం చేసే ముందు.. పూజా నియమాల ప్రకారం మొదట విఘ్నలకధిపతి ని పూజ చేసి అనంతరం
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
అంటూ లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి. కలశం ఏర్పాటు చసి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి, షోడశోపచార పూజ, తరువాత అథాంగ పూజచేయవలెను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి మంగళహారతి ఇచ్చి, తోరగ్రంథి పూజ చేసి, తోరబంధన మంత్రం పఠిస్తూ, ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించాలి. చివరిగా రవిక, పసుపు, కుంకుమ, తాంబూలంలతో పాటు వాయనదాన మంత్రం పఠిస్తూ ముత్తైదువుని మహాలక్ష్మీగా భావించి వాయనం ఇవ్వాలి.
ఈ పండుగను హిందూ మతం ప్రకారం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం 8 ఆగస్టు 2025న వచ్చింది.
సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం) – ఉదయం 06:29 – ఉదయం 08:46
వృశ్చిక లగ్న పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – మధ్యాహ్నం 01:22 – మధ్యాహ్నం 03:41
కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) – రాత్రి 07:27 – రాత్రి 08:54
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:55 PM – 01:50 AM, ఆగస్టు 9
లక్ష్మీ దేవిని పూజించడానికి ఉత్తమ సమయం స్థిరమైన లగ్న సమయం..నమ్మకాల ప్రకారం, స్థిరమైన లగ్న సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక శ్రేయస్సు లభిస్తుంది.
వరలక్ష్మీ వ్రతం సమయంలో తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది వరుస ముడులు మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి పసుపు పూసిన దారాన్ని తోరణంగా కడతారు. ఈ తోరణాన్ని.. వరలక్ష్మి వ్రతం పూజ సమయంలో అమ్మవారి ముందు పెట్టి.. దానికి తోరగ్రంథి పూజ చేయవలెను. పూజ చివరిలో ఈ తోరణాన్ని తీసుకుని రక్షణ చిహ్నంగా కుడి మణికట్టుకి ధరించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.