Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ (ShubhKruth) నామ సంవత్సర ఉగాది(Ugadi) ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (koil alwar thirumanjanam) శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.
ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాల్లో శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న సంగతి తెలిసిందే..
Read Also: Heart Disease: ఈ ప్రాంతాల్లో నివసించే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువంటున్న పరిశోధకులు