TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే బ్రేక్ దర్శనాల్లో ప్రయోగాత్మక మార్పులు..

|

Nov 30, 2022 | 7:49 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 30న...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే బ్రేక్ దర్శనాల్లో ప్రయోగాత్మక మార్పులు..
Tirumala Tirupati Devasthanam
Follow us on

తిరుమల శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, దీంతో తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.

ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్నారు. గురువారం నుంచి ఉదయం 8 గంటలకు అనుమతిస్తారు. స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలిస్తారు. శ్రీవారి ఆలయంలో 1994కి పూర్వం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు లేవు. భక్తులందరినీ స్వామి దర్శనానికి కులశేఖరపడి వరకు అనుమతిచ్చేవారు. వీఐపీలు ఏ సమయంలో వచ్చినా దర్శనానికి అనుమతించేవారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్‌ దర్శనాల్లో అనేక మార్పులు వచ్చాయి.

అయితే.. బ్రేక్‌ దర్శనాలకే మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుండడంతో సర్వదర్శనం కోసం వేచి చూసే టైమ్ పెరుగుతోంది. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు నిలిపేసిన క్యూ లైన్‌ తరువాత రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుంది. నెలరోజులు పరిశీలించి ఈ విధానం అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..