TTD Herbal products: దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచగవ్యాలతో హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని వేగ వంతం చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఈవో ఎస్వీ గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. పంచగవ్యాలలో ధూపం, సబ్బులు, అగరబత్తీలు, పరిశుభ్రతా సామగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైనన్ని టిటిడి గోశాలలో త్వరిత గతిన తయారీకి చర్యలు తీసుకోవాలని ఎస్వీ గోశాల అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్‌లోని ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తుల తయారీకి అర్హత కలిగి ఉన్నట్లు తెలిపారు.
పూజల్లో వినియోగించే పంచగవ్య ఉత్పత్తులైన ధూప్‌చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్‌లు టిటిడి, గృహ, శైవ దేవాలయాలలో వినియోగం కోసం విబూదిని తయారుచేసి త్వరలో విక్రయాలు ప్రారంభించాలన్నారు. అదేవిధంగా పంచగవ్య టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్, సోప్, మూలికా షాంపూలు, నాజల్ డ్రాప్స్, గో ఆర్క్ అందుబాటులో ఉంచాలన్నారు.
టీటీడీ వసతి సముదాయాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పంచగవ్య హెర్బల్ ఫ్లోర్ క్లీనర్‌ను ఉపయోగించాలన్నారు ఈవో. హోమ కార్యక్రమాల్లో వినియోగించే ఆవు పేడతో చేసిన పిడకలు తదితర వాటిని సిద్ధంచేయాలన్నారు. వీటి స్టోరెజ్ కొరకు తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తులను మొదట తిరుమల, తిరుపతిలలో, తరువాత బయట ప్రాంతాల్లో విక్రయించాలని ఈవో సూచించారు.
Read also : E-commerce: ఫ్లాష్ సేల్స్‌లతో దూసుకెళ్తోన్న ఇ-కామర్స్ కంపెనీలకు కళ్ళెం.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం