TTD Tickets: ఏడుకొండలవాడు ఎప్పటికీ స్పెషలే.. కలియుగ ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారిని దర్శించకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కరోనా అయితే ఏంటి? ఇంకేదైతే ఏంటి? స్వామి దర్శనం లభిస్తే చాలు అనుకునే భక్తులు కోట్లలో ఉన్నారు. అందుకేనేమో.. ఈ రికార్డు స్థాయి హిట్స్.. నిమిషాల్లోనే లక్షల టిక్కెట్ బుకింగ్స్‌తో అందరినీ విస్తుగొలిపించారు భక్తులు.
శ్రీవారిని దర్శించుకోవాలని మనసు తలిస్తే చాలు.. ఏడుకొండలపైకి ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు.. ఇది గతంలో పరిస్థితి. కానీ, కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కొవిడ్ ప్రొటోకాల్స్‌లో భాగంగా దర్శనాల్ని నిర్ణీత సంఖ్యలో కల్పిస్తోంది టీటీడీ. ఆన్‌లైన్‌లోనే దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేస్తోంది. అలా బుక్ చేసుకున్న తేదీకి ముందుగానీ, ఆ తర్వాత గానీ వెళ్లడానికి వీల్లేదు.
ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్ టిక్కెట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే, ఇవాళ ఉదయం జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన 4లక్షల 60వేల దర్శనం టోకెన్లు.. హాట్‌కేకుల్లా బుక్కయిపోయాయి. ఒక్కసారిగా దర్శనం టిక్కెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కు 14లక్షల హిట్లు రావడం విశేషం. ఏకంగా 55 నిమిషాల్లో 4లక్షల అరవై వేల దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్నారు భక్తులు. ఈ స్థాయిలో ఒకేసారి టిక్కెట్లు బుక్ కావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
కోవిడ్ విజృంభిస్తున్న వేళ రోజుకిన్ని అనే విధానంతో ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తున్నప్పటికీ.. డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని.. ఇవాళ్టితో మరోసారి రుజువైంది. జనవరి 1 నుంచి 31వరకు.. రోజుకు 12 వేలు చొప్పున.. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అలా విడుదల చేశారో లేదో.. మొత్తం టిక్కెట్లు గంటలోపే అయిపోయాయి. దీన్నిబట్టి, డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరికి సంబంధించి 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు గురువారం విడుదల కాగా.. అవి కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి. ఇక శనివారం నాడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు కూడ విడుదల కానుండగా. 5వేలు ఆన్‌లైన్‌లో.. మరో 5వేల టికెట్లను తిరుపతిలోని కౌంటర్‌లో జారీ చేయనున్నారు.
అలాగే, తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులు టీటీడీ పేర్కొంది.
Also read:
Greenko: వరల్డ్‌లోనే టాప్-3 ర్యాంక్ సాధించిన గ్రీన్‌కో.. తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డ్..