
తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. సెప్టంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్టలు కలిసి పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టంబర్ మొదటి వారంలోపు ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. సెప్టంబర్ 24న ధ్వజారోహణం రోజు సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. మాడ వీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అదనపు సిబ్బంది నియమించనున్నట్లు ఈఓ శ్యామల రావు తెలిపారు.
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందేలా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాది గరుడ వాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అందుకనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. తిరుపతిలో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరిణి లోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దకంతో మరింతగా ఆకట్టుకుంటుంది. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపిన టిటిడి అధికారులు ఈ మేరకు మరమ్మతు పనులు పూర్తిచేశారు. స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల తో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపి వేసింది. ఇక భక్తులను సైతం నెల రోజులపాటు స్వామి వారి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. మరమత్తు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి పుష్కరిణీలోకి టిటిడి భక్తులను అనుమతించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..