తిరుమల శ్రీవారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అవుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో పెట్టిన రెండు గంటల్లోనే మూడు లక్షల 50 వేల టికెట్లు బుక్ చేసుకున్నారు. రోజుకు 25 వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. మొత్తం 13.35 లక్షల టికెట్లకుగాను ఫస్ట్ రెండు గంటల్లోనే రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఇక వేసవి సెలవులతో తిరుమల కొండ కిక్కిరిసింది. శ్రీవారి భక్తులతో కొండ పొటెత్తింది. భక్తులతో కంపార్టుమెంట్లు కిటకిట లాడుతున్నాయి. భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12గంటల పైనే పడుతుంది. వీకెండ్స్ లో శ్రీవారి హుండీ ఆదాయం భారీ గా నమోదయింది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేసింది. సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో, తిరుమలలోని భూదేవి కంప్లెక్స్, శ్రీనివాస కంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఇప్పటికే భక్తులకు అందింస్తుంది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.