Tirumala: ఎగరేస్తే బ్లాస్ట్ అవ్వాల్సిందే.. త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్‌ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. కొండపై భద్రతకు పెద్దపీట సరే.. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా?.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Tirumala: ఎగరేస్తే బ్లాస్ట్ అవ్వాల్సిందే.. త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌!
Tirumala

Updated on: May 13, 2025 | 7:24 PM

తిరుమల శ్రీవారి ఆలయంపై తరచుగా డ్రోన్ల సంచారం.. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ని కలవరపెడుతోంది. ఈ క్రమంలో యాంటీ డ్రోన్‌ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని చాలాసార్లు టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మధ్య కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి కూడా లేఖ రాసింది. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

ఈ టెక్నాలజీతో కొండ పరిసర ప్రాంతాలపై వీడియో ట్రాకింగ్‌ ఉంటుంది. ఇందులో లాంగ్ రేంజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌.. సుదూర ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగరేసినా ఇట్టే పసిగడుతుంది. ఆర్‌ ఎఫ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో ఆపరేటర్‌కు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్‌ ఎఫ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అనుమానిత వస్తువుల్ని ఐడెంటిఫై చేయగానే.. మొబైల్ రెస్పాన్స్ టీమ్‌ అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత జామింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తారు. దీంతో డ్రోన్‌ను నియంత్రించే సంకేతాలను నియంత్రించి.. అడ్డగిస్తుంది. రెప్పపాటులో డ్రోన్‌ దగ్గరకు వెళ్లి దాన్ని క్రాష్ చేస్తుంది.

ఈ టెక్నాలజీతో కొండపై భద్రతను పటిష్టం చేసుకోవాలనుకుంటోంది టీటీడీ. 2023లో IOCL గ్యాస్ ప్లాంట్ సర్వేకి వచ్చిన కొందరు డ్రోన్‌తో శ్రీవారి ఆలయాన్ని మాడ వీధుల్ని చిత్రీకరించారు. 2024లో హరియాణాకు చెందిన ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేసి శ్రీవారి మెట్టు, నడకమార్గాన్ని చిత్రీకరించాడు.

ఈ మధ్య రాజస్థాన్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ మాడవీధులతో పాటు అఖిలాండం వరకు డ్రోన్‌తో షూట్ చేశాడు. ఇలా జరిగినప్పుడల్లా విజిలెన్స్ అధికారులు డ్రోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అదే యాంటీ డ్రోన్‌ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్ ఎగిరే ఛాన్సే ఉండదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..