Shakuni Temple: మహాభారతం ఎప్పటికీ చెక్కుచెదరని ఒక అద్భుతం. దీనిలోని ప్రతి పాత్రా దేనికి దానికే ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఇతిహాసంలో కనిపించే ప్రతిఒక్కరూ తమదైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇందులో మంచీ, చెడు మధ్య పోరాటం కనిపించినా.. మంచివాళ్ళుగా కనిపించే పాత్రలకు ఎంత ఆదరణ లభించిందో.. చెడువైపు ఉన్నవాళ్లుగా నిలిచిన వారి పాత్రలూ అంతగా జనంతో ఓహో అనిపించుకున్నాయి. మహాభారతంలోని ప్రతి పాత్రకూ ఒక విధమైన ప్రత్యేకత ఉంటుంది. అది హీరోనా.. విలనా అనేది ఉండదు. కౌరవుల వైపు ఎందరో నిలబడి పోరాడారు. కానీ, వారంతా చరిత్రలో గొప్పపేరును సంపాదించుకున్నారు. దానికి కారణం వారు ధర్మబద్ధులుగా ఉండడటమే.
ఇటువంటి పాత్రల్లో శకుని కూడా ఒకటి. శకుని పేరు చెబితే విలన్ లానే అనిపిస్తుంది. కానీ, ఆయనకూ అభిమానులు ఉన్నారు. ఆయన కోసం కూడా ఒక ఆలయం ఉంది. ఆయనకూ పూజలు జరుగుతున్నాయి. ఎక్కడో కాదు మన దేశంలోనే. అసలు శకునికి గుడి ఎక్కడ ఉంది? ఎందుకు అక్కడ ఆయనను కొలుస్తారు? మహాభారతంలో విలన్ అయినా.. ఆయనకు అభిమానులు ఎందుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శకుని గురించి కొంత..
శకుని, గాంధార యువరాజు. కౌరవుల తల్లికి స్వయానా సోదరుడు. అంటే మేనమామ. దుర్యోధనుడిలో అహంకారాన్ని పెంచడంలో.. అతన్ని పతనం వైపు నడిపించడంలో శకునిదే కీలకపాత్ర. తనకున్న పాచికలు ఆడే విజ్ఞానంతో.. దుర్యోధనుని అభిమానం సాధించి.. అతనికి ముఖ్య..ప్రధాన సలహాదారుగా వెన్నంటి ఉంటాడు శకుని. మామూలుగా మహాభారత కథ వైనేవారికి శకుని అంటేనే విలన్ అని అనిపిస్తుంది. మరి అటువంటి శకునికి ఆలయం ఉంది.
శకునికి గుడి..
మాయమ్‌కొట్టు మలంచరువు మలనాద ఆలయం భారతదేశంలో అత్యంత విశిష్ట దేవాలయాలలో ఒకటి. మహాభారతంలో అత్యంత నిందించబడిన పాత్ర శకుని ఆలయం ఇది. కేరళలోని ఈ ఆలయం గర్భగుడిలో విగ్రహం ఉండదు. కేవలం శకుని కూర్చున్న గ్రానైట్ ముక్క మాత్రమే ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆచారాలు పాటించడం.. కానుకలు ఇవ్వడం.. మొక్కులు మొక్కడం వంటివి ఏవీ ఇక్కడ ఉండవు. కేవలం లేత కొబ్బరికాయలు, కొన్ని రకాల స్థానిక ఆహార పదార్ధాలు అందిస్తారు అంతే. పాచికల ఆటలో ఓడిపోయి ఆ ఆట నిబంధనలలో భాగంగా అజ్ఞాతంగా నివసిస్తున్న పాండవులను అనుసరిస్తూ వెళ్లిన కౌరవ గుంపులో శకుని కూడా ఉంటాడు. ఆ సమయంలో కౌరవులు తమ ఆయుధాలు ఇక్కడే దాచారని చెబుతారు. అందుకే ఇక్కడ ఈ ఆలయం నిర్మించారని స్థానిక కథనం. అదేవిధంగా ఇక్కడ శకుని ధ్యానం చేసి తపస్సు చేసినట్లు కూడా చెప్పుకుంటారు. ఈ శకుని దేవాలయాన్ని చాలా మంది సందర్శిస్తారు. పురాణాల్లో విలన్ గా చెప్పబడిన శకునికి ప్రజలు పూజలు చేయడం విశేషమే.
అయితే, మహాభారతంలో శకుని విలన్‌గా కనిపించవచ్చు, కానీ మనం సరిగ్గా మహాభారతాన్ని అర్ధం చేసుకుంటే.. శకుని ప్రతీకారం తీర్చుకునే యువరాజు మాత్రమే. మహాభారతంలో ఈ విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఎందుకో తరచూ ఈ అంశాన్ని విస్మరించి శకునికి ఒక విలన్ లానే భావిస్తారు. కురుజాతిని నాశనం చేయడమే శకుని జీవిత లక్ష్యం. అతనిలో అంత పగ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైనది.. తానెంతో ఇష్టపడే తన సోదరి గాంధారిని ఒక గుడ్డివాడికి ఇచ్చి వివాహం చేయడం. ఆమె చీకటిలోనే ఉండిపోవాల్సి రావడం. ఇంకా వేరే కారణాలు ఉన్నా.. ఇదే ప్రధానంగా చెబుతారు. దీంతో కురుజాతిని నాశనం చేయాలనే.. శకుని జీవితం అంతా అందరికీ విలన్ లా కనిపించేలా మారిపోతాడు. తన తెలివితేటలతో దుర్యోధనుడ్ని పూర్తిగా తప్పుదారి పట్టించి తన వంశాన్ని తానే నాశనం చేసుకునేలా చేస్తాడు శకుని. అతని జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాడు కూడా. ధృతరాష్ట్రుడు తన పిల్లల్లో ఇద్దరు మాత్రమే చివరికి మిగులుతారు. ఒకరు పాండవ పక్షాన చేరిపోయిన యుయుత్సుడు, మరొకరు అతని కుమార్తె దుశ్శల.
ఈ ఆలయాన్ని ప్రజలు సందర్శించడానికి కారణం అతని సంకల్పానికి నివాళులర్పించడం కోసమే అని చెబుతారు. శకుని తన పగను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడతాడు. అన్నిటినీ ఓపికగా భరించి తాను అనుకున్నది సాధిస్తాడు. ఈ పట్టుదలకు గౌరవసూచికగానే ఎక్కడ ఈ ఆలయంలో శకునికి నైవేద్యం పెడతారని స్థానికంగా చెప్పుకునే మాట.
Also Read: Sawan Somvar: ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం శ్రావణ సోమవారం రోజున శివుడిని ఇలా పూజిస్తే అద్భుత ఫలితాలు