
సుబ్రమణ్య జననం కథ, సనాతన ధర్మంలో ఒక అత్యద్భుతమై.. శక్తివంతమైన ఘట్టంగా పరిగణిస్తారు. ఈ కథను విన్నవారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారని నమ్మకం. శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి గంగానది ఆవిర్భావంతో పాటు ఈ వృత్తాంతాన్ని వివరించారు. ఈ కథను గర్భిణీ స్త్రీలు పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైన సంతానాన్ని పొంది, సుఖప్రసవం అవుతుందని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వివరించారు. మన్మథుడు పరమశివుడిపై పుష్పబాణాలు వేయడానికి ప్రయత్నించినప్పుడు, శివుడు తన మూడవ కన్ను తెరిచి అతడిని భస్మం చేశాడు. దీంతో సృష్టిలో కామప్రచోదనం ఆగిపోయింది. అప్పుడు పార్వతీదేవి స్వయంగా మన్మథుడి ఆయుధాలను ధరించి, తన అందంతో శివుడిని వశపరుచుకొని వివాహం చేసుకుంది. శివపార్వతులు ఏకాంతంగా వంద దివ్య సంవత్సరాలు గడిపినప్పటికీ వారికి సంతానం కలుగలేదు. ఈ సమయంలో దేవతలు అందరూ సమావేశమయ్యి.. శివపార్వతులు తేజస్సులు నుంచి సంతానం పుడితే.. ఆ ప్రాణిని చూసేందుకు కూడా తమ వల్ల కాదని నిర్ణయానికి వచ్చారు.
అనుకున్న తడవుగా దేవతలు శివుని వద్దకు వచ్చి, వారి తేజస్సును లోకంలోకి విడిచిపెట్టవద్దని, ఇకపై పార్వతీ దేవితో కలవవద్దని.. తపస్సు మాత్రమే చేసుకోవాలని కోరారు. దీనికి శివుడు అంగీకరించాడు, కానీ అప్పటికే తన నుంచి కదలిన తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలో చెప్పమని ప్రశ్నించాడు. దేవతలు భూమిని చూపించారు. భూమి సంతోషంగా శివ తేజస్సును స్వీకరించింది, కానీ దాని వేడిని భరించలేకపోయి పెద్ద కేకలు వేసింది. భూమి అగ్నిహోత్రుడికి ఆ తేజస్సును అప్పగించింది. తమకు సంతానం కలగకుండా దేవతులు చేసిన పనికి ఆగ్రహించిన పార్వతీదేవి.. దేవతలకు వారి భార్యలతో ఎప్పటికీ సంతానం కలగదని శాపం పెట్టింది. శివ తేజస్సును తీసుకున్నందుకు భూమి కూడా ఒక్కో చోట ఒక్కో రూపాన్ని కలిగి ఉంటుందని, పలువురు భర్తలు ఉంటారని శపించింది.
శివపార్వతులకు ఇకపై పిల్లలు పుట్టరని అర్థం చేసుకున్న.. తారకాసురుడు అనే రాక్షసుడు.. తనకు శివపార్వతుల కుమారుడి చేతిలోనే మరణం ఉండేలా చూడాలని కోరడంతో.. బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు. దీంతో తారకాసురుడు దేవతలను వేధించడం మొదలెట్టాడు. దీంతో దేవతలు అతడ్ని సంహరించడానికి శివ తేజస్సుతో పుట్టిన కుమారుడు అవసరం కాబట్టి దేవతలు బ్రహ్మను వేడుకున్నారు. అగ్ని వద్ద ఉన్న శివ తేజస్సును పార్వతీదేవి సోదరి అయిన గంగాదేవిలోకి ప్రవేశపెట్టమని బ్రహ్మ సూచించాడు. గంగాదేవి దేవతల ప్రార్థన మేరకు శివ తేజస్సును తనలోకి తీసుకుంది. గంగ కూడా ఆ తేజస్సు వేడికి తట్టుకోలేక హిమాలయ పర్వత ప్రాంతంలోని రెల్లు దుబ్బుల్లో (శరవణాలు) దానిని విడిచిపెట్టింది. ఆ రెల్లు దుబ్బుల నుంచి ఆరు ముఖాలతో, అద్భుత సౌందర్యంతో సుబ్రమణ్యుడు జన్మించాడు. పుట్టిన వెంటనే పాలు కావాలని ఏడవగా, కృత్తికలు అతడికి పాలిచ్చారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. అగ్నిలో నిలవబడినందున పావకి, శరవణాల్లో పుట్టినందున శరవణభవ, బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం, తల్లి కడుపులోంచి కాకుండా స్కలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు వంటి అనేక నామాలు ఆయనకు వచ్చాయి. ఈ పుణ్యగాథ శ్రవణం అభీష్టసిద్ధిని, ముఖ్యంగా సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం దిగువన వినండి…