Tirupati: వేంకటేశ్వరస్వామివారి గెడ్డం కింద రోజూ పచ్చకర్పూరం అద్దుతారు ఎందుకో తెలుసా..

|

Apr 06, 2022 | 7:53 AM

Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) క్షేత్రం ఎన్నో రహస్యాలు నిలయం. కోనేటి రాయుడిని కొలిచి జన్మ చరితార్థం చేసుకున్న భక్తాగ్రేసరులు అనేకమంది ఉన్నారు. అన్నమాచార్య

Tirupati: వేంకటేశ్వరస్వామివారి గెడ్డం కింద రోజూ పచ్చకర్పూరం అద్దుతారు ఎందుకో తెలుసా..
Sri Venkateswara Swamy
Follow us on

Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) క్షేత్రం ఎన్నో రహస్యాలు నిలయం. కోనేటి రాయుడిని కొలిచి జన్మ చరితార్థం చేసుకున్న భక్తాగ్రేసరులు అనేకమంది ఉన్నారు. అన్నమాచార్య(Annamacharya), వెంగమాంబ (Vengamamba) వంటి వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు.  శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గెడ్డానికి పచ్చకర్పూరం అద్దడానికి శ్రీ అనంతాళ్వార్ కు మధ్య జరిగిన ఒక సంఘటన కారణమని ఓ కథనం ఉంది.

రామానుజాచార్యుని అభిమతానుసారం శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనం. అందులో భాగంగా తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు అనంతాళ్వారు నివసించారు. రోజూ శ్రీవారికి పూలమాలాలు సమర్పించేవారు. అందుకోసం తిరుమలలో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామివారికి సమర్పించేవారు. అయితే పూల తోట పెంచడానికి అనంతాళ్వారులు తన భార్య సహకారం తీసుకున్నారు.  అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టితట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు.

అనంతరం ఆ బాలుడు అనంతాళ్వారులు కు సహాయం చెయ్యటానికి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారులు భార్య కి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, భార్య అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది.

అనంతరం ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. మర్నాడు చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి గడ్డగునపం.. దెబ్బ తగిలి రక్తం రావటం చూసి, అయ్యో … తాను  గునపం విసిరింది ఎవరిమీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడి మీదే అని గ్రహిస్తాడు.

బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి ఆ దేవదేవుడే వచ్చాడని తెలుసుకుంటాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.  అప్పటినుంచి స్వామివారి గడ్డం పై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు.

Tirumala

అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం ఆ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు. నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది.

Also Read: Viral Video: అమ్మవారి నగలపై కన్నేసిన.. కిటికీ లో ఇరుక్కుని నానాతంటాలు పడ్డ దొంగ.. నెట్టింట్లో వీడియో వైరల్