Sravana Masam 2022: విష్ణువు, లక్ష్మీదేవిలతో పాటు.. శివుడికి కూడా ప్రీతికరమైనది శ్రావణ మాసం. ఈ రోజు దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద శివలింగం స్థాపన గురించి తెలుసుకుందాం. గోండా జిల్లాలోని ఖర్గుపూర్‌లో ఉన్న చారిత్రాత్మకమైన పృథ్వీనాథుడు దేవాలయాన్ని పాండు కుమారుడు భీముడు స్థాపించాడు. వనవాస సమయంలో భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు.. ఆ పాపం పోగొట్టుకోవడానికి శివుడు పూజించి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివలింగాన్ని స్థాపించినట్లు చారిత్రక కథనం. ఈ పృథ్వీనాథ్ ఆలయంలోని శివలింగం ఆసియాలోనే అతిపెద్ద శివలింగంగా పరిగణించబడుతుంది. ఈ శివాలయం వందల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఇక్కడ శివుడిని గోండాలు మాత్రమే కాదు.. నేక సమీప జిల్లాల నుండి ప్రజలు పూజిస్తారు. జలాభిషేకం చేస్తారు. ఇక్కడ శివయ్య భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవం భావించి పూజిస్తారు.
ఆలయ ప్రధాన పూజారి జగదాంబ ప్రసాద్ తివారీ మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు శివయ్య దర్శనం చేసుకుంటారని చెప్పారు. సోమవారం రోజున భక్తుల రద్దీ లక్షలకు చేరుకుంటుదని అన్నారు. ఖర్గుపూర్‌లో ఉన్నఈ ఆలయం సుమారు 5 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. పాండు కుమారుడు భీముడు తన ఐదుగురు సోదరులతో కలిసి అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో.. పాండవులు చక్ర నగరంలో ఆశ్రయం పొందారు. అక్కడ బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఒక గ్రామంలోని కుటుంబంలోని ఒక వ్యక్తిని ఆహారంగా తినేవాడు. ఒకరోజు భీముడికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం వంతు వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులకు బదులు భీముడు బకాసురుడి వద్దకు వెళ్లి.. బకాసురుడితో యుద్ధం చేసి భీముడు రాక్షసుడిని చంపాడు. బకాసుర సంహారం వల్ల తనకు వచ్చిన పాపం పోగొట్టుకోవడానికి, శివలింగాన్ని స్థాపించి.. పూజలు చేసి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఈ శివలింగం పురాతన కాలం నాటిది. అయితే, కాలక్రమేణా.. మహాదేవుని ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. భీముడు స్థాపించిన ఈ శివలింగం భూమిలో కలిసిపోయింది.
ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో శివలింగం లభ్యం:
అనంతరం ఖర్గుపూర్‌కు చెందిన రాజా గుమాన్ సింగ్ అనుమతితో ఇక్కడ నివాసముంటున్న పృథ్వీ సింగ్ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. ఓ రోజు రాత్రి పృథ్వీ సింగ్ కలలో నేలలో శివలింగం ఉన్నట్లు కలలో కనిపించింది. అనంతరం పృథ్వీ సింగ్ అక్కడ తవ్వకాలు చేపట్టాడు.. అప్పుడు ఓ భారీ శివలింగం ఉద్భవించింది.అప్పటి నుంచి పృథ్వీ సింగ్ హవాన్ పూజలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఈ ఆలయం పృథ్వీనాథ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ఐదున్నర అడుగుల ఎత్తైన శివలింగం నలుపు, అరుదైన రాళ్లతో నిర్మించబడింది. ఇక్కడ శివలింగానికి జలాభిషేకం చేయడంకోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకం.
ఆసియాలోనే అతి పెద్ద శివలింగంగా పురావస్తు శాఖ నిర్ధారణ:
చారిత్రాత్మక బద్రీనాథ్ ఆలయంలో స్థాపించబడిన శివలింగం ఆసియాలోనే అతిపెద్ద శివలింగంగా పరిగణించబడుతుంది. పురావస్తు శాఖ కూడా శివలింగాన్ని ఆసియాలోనే అతిపెద్ద శివలింగంగా నిర్ధారించింది. వాస్తవానికి సుమారు మూడు దశాబ్దాల క్రితమే జిల్లాకు చెందిన అప్పటి ఎంపీ కున్వర్ ఆనంద్ సింగ్ ఈ ఆలయ పురాణాలను పరిశోధించాలని పురావస్తు శాఖకు లేఖ రాశారు. ఎంపీ లేఖపై పురావస్తు శాఖ బృందం ఇక్కడికి చేరుకుని శివలింగాన్ని పరిశీలించగా.. 5000 ఏళ్ల క్రితం మహాభారత కాలం నాటి శివలింగం ఆసియాలోనే అతిపెద్ద శివలింగమని పురావస్తు శాఖ నిర్ధారించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..