ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో పేరు వినని వారు ఉండరు. 1802లో పుట్టి 1885లో కాల ధర్మం చెందిన విక్టర్ హ్యూగో ‘లే మిసరబుల్స్’ వంటి ఉత్తమోత్తమ గ్రంథాలు రచించాడు. లే మిసరబుల్స్ అనే గ్రంధాన్ని ఆధారం చేసుకుని తెలుగులో బీదల పాట్లు అనే సినిమా నిర్మించడం కూడా జరిగింది. ఆయన మంచి రచయితే కాదు, ఆధ్యాత్మికవేత్త కూడా. మొదట్లో నాస్తికుడిగా, హేతువాదిగా ఉన్న హ్యూగో ఆ తరువాత కాలంలో ఆధ్యాత్మికవేత్తగా మారారు. తన జీవితంలో చోటు చేసుకున్న ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని ఆయన ఆధ్యాత్మిక కోణం నుంచి చూసేవారు. ఆయన జీవితంలో ఒకరోజు జరిగిన ఒక చిన్న సంఘటన ఆయన జీవితం మీద ఎంతో ప్రభావం చూపించింది.
ఆయన ఆరు నెలలు ఫ్రాన్స్ లో ఉంటే మిగిలిన ఆరు నెలలు ఇంగ్లాండ్ తదితర దేశాల్లో గడిపేవారు. ముఖ్యంగా శీతాకాలంలో ఆయన ఫ్రాన్స్ నుంచి వెళ్లిపోయి వేసవికాలంలో తిరిగి వచ్చేవారు. ఇది చాలా ఏళ్లపాటు జరిగింది. ఆయన ఒకసారి ఫ్రాన్స్కు తిరిగివచ్చి ఇంటి తలుపు తీసేసరికి, ఇంట్లో ఒక కందిరీగ తిరుగుతూ కనిపించింది. మూసేసి ఉన్న కిటికీ తలుపుల్ని అది తన బలమంతా ఉపయోగించి ఢీ కొడుతోంది. ఇది గమనించిన విక్టర్ హ్యూగో ఇంటి ద్వారాన్ని తెరిచి ఉంచినా అది బయటకు పోవడం లేదు. అది బాగా భయపడుతున్నట్టు ఆయనకు అర్థమైంది. ఆ కిటికీ గుండా నే వెళ్లాలని అది గట్టి ప్రయత్నం చేస్తోంది. దాన్ని బయటకి తరిమేయాలని ఆయన రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ అది బయటికి వెళ్ళటం లేదు. అది ఢీకొడుతున్న కిటికీ తలుపుని తీయాలని ఆయన ప్రయత్నించాడు. కానీ మంచు కారణంగా అది బాగా బిగుసుకుపోయింది. ఎంత గట్టిగా ప్రయత్నించినా తెలుసుకోవడం లేదు. ఇక కిటికీ తలుపు మీద దాడి చేస్తున్న కందిరీగ బాగా నీరసపడిపోతోంది. ఇంకా కాసేపు ఇదే విధంగా అది దాడి చేస్తే చచ్చిపోయేటట్టు కనిపించింది.
ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. దాన్ని ఏదో విధంగా బయటకు పంపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అది చాలా చిన్న ఇల్లు. వంటింట్లో ఉన్న కిటికీని తెరవాలని ప్రయత్నించాడు కానీ అది కూడా మంచు వల్ల గట్టిగా బిగుసుకుపోయింది. ఆయన మళ్లీ మొదటి గదిలోని కిటికీ దగ్గరకే వచ్చాడు. బిగిసుకుపోయిన కిటికీని తెరవటానికి గరిట, చెంచా, సుత్తి లాంటి వాటితో ప్రయత్నించాడు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ లోగా ఆ కందిరీగ ఆయన మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. ముఖం మీద, చేతుల మీద బాగా కుట్టింది. మధ్య మధ్య తలుపు మీద కూడా దాడి చేస్తోంది. ఆయన పట్టు విడవకుండా చాలాసేపు గట్టిగా ప్రయత్నించిన తర్వాత ఒక పక్కన కిటికీ తలుపు కొద్దిగా తెరుచుకుంది. అయినప్పటికీ కందిరీగ మాత్రం తెరవని కిటికీ తలుపు మీదే ఇంకా దాడి చేస్తోంది. ఇక హ్యూగో ఆ కందిరీగను పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దాన్ని పట్టుకుని బయటకు వదిలిపెట్టాలని ఆయన ఉద్దేశం. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఆయన చేతిని రక్తం వచ్చేటట్టు కుట్టేస్తోంది. అయినప్పటికీ ఆయన దాన్ని వదిలిపెట్టలేదు. అతి కష్టం మీద దాన్ని పట్టుకొని కిటికీలోంచి బయటకు వదిలిపెట్టాడు. బయటకు వచ్చిన కందిరీగ ఒక్క క్షణం గాలిలోనే ఆగిపోయింది. అది ఆయన చర్యకు నిర్ధాంత పోయినట్టు, దిగ్భ్రాంతి చెందినట్టు కనిపించింది. ఆ తర్వాత ఆనందంగా ఎగిరిపోయింది.
నన్ను బయటికి వదిలి పెట్టడం కోసమా ఆయన ఇంతవరకు శ్రమపడింది అన్నట్టుగా చూసింది అది. దీనిని చూసిన తరువాత హ్యూగో కు ఒక్క విషయం స్తురించింది. అనేక సందర్భాలలో దేవుడు మనకు స్వేచ్ఛనివ్వడానికి, మన సమస్యల్ని పరిష్కరించడానికి, మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మనకు ఇది అర్థం కాక గింజుకుంటాం. దేవుడిని తిట్టుకుంటాం. మనకు మాత్రమే దేవుడు కష్టాలు ఇస్తున్నాడని బాధపడతాం. చివరికి మన సమస్య పరిష్కారం అయ్యేసరికి ఆనందంతో పొంగిపోతాం. ఈ చిన్న సంఘటన తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని విక్టర్ హ్యూగో తన ఆత్మ కథలో రాసుకున్నారు.