Shani Jayanti: రేపే శని జయంతి.. ఈ వస్తువులను దానం చేయండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం..
శనిశ్వరుడి ఆశీస్సులు పొందడానికి శని జయంతి పండుగను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎవరైనా శని దోషం, ఏలి నాటి శని , లేదా శని ధైయా తో బాధపడుతుంటే... శనిశ్వరుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయమని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహంతో జీవితంలోని కష్ట నష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. శని న్యాయమూర్తి. ప్రజలకు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని జయంతిని వైశాఖ మాసంలోని అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మంగళవారం మే 27వ తేదీ, 2025న శని దేవుడి జన్మదినంగా జరుపుకోనున్నారు. ఈ రోజు శనీశ్వరుడి ఆశీర్వాదాలను పొందడానికి చాలా శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఎవరైనా శని దోషం, ఏలి నాటి శని , లేదా శని ధైయా తో బాధపడుతుంటే ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. శని జయంతి సందర్భంగా దానం చేయవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఈ రోజు తెలుసుకుందాం…
ఏ వస్తువులను దానం చేయాలంటే
నల్ల నువ్వులు: నల్ల నువ్వులు శని దేవునికి చాలా ప్రియమైనవి. వాటిని దానం చేయడం వల్ల శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది దురదృష్టాన్ని దూరం చేస్తుంది . ఇంటికి శాంతి ,శ్రేయస్సును తెస్తుంది. పేద వారికి, అవసరంలో ఉన్న వ్యక్తికి లేదా శని ఆలయంలో నల్ల నువ్వులను దానం చేయండి.
మినపప్పు: నల్ల మినపప్పును శని గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. మినప పప్పుని దానం చేయడం ద్వారా, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది. శనీశ్వరుడు సంతోషిస్తాడు. పేదలకు, ముఖ్యంగా శని ఆలయం బయట కూర్చువారికి లేదా ఏదైనా పేద కుటుంబానికి మినప పప్పుని దానంగా ఇవ్వడం చాలా శుభప్రదం.
ఆవ నూనె: ఆవ నూనె శని దేవునికి చాలా ప్రియమైనది. శని జయంతి నాడు ఆవనూనె దానం చేయడం, శనీశ్వర ఆలయంలో దీపం వెలిగించడం ద్వారా శని దేవుడు శాంతించి తన భక్తులకు ఆశీస్సులని ఇస్తాడు. అంతేకాదు ఇలా చేయడం వలన ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తీరతాయి. శని ఆలయంలో లేదా ఏదైనా పేద వ్యక్తికి దానం చేయండి.
నల్లని దుస్తులు: నల్లని దుస్తులు శనీశ్వరుడి శక్తి, ప్రభావాన్ని సూచిస్తాయి. నల్లని వస్త్రాలను దానం చేయడం ద్వారా శనిదేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ పరిహారం పెండింగ్ పనులను పూర్తి చేయడంలో కూడా సహాయపడుతుంది. పేద లేదా నిస్సహాయ వ్యక్తులకు నల్లని దుస్తులు దానం చేయండి.
ఇనుప వస్తువులు: ఇనుము శనీశ్వరుడి గ్రహానికి చెందిన లోహం. ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం ద్వారా శనిదేవుడు సంతోషించి, అన్ని కష్టాలను తొలగిస్తాడు. పేదవారికి ఇనుప పాత్రలు లేదా ఏదైనా ఇతర ఇనుప వస్తువును దానం చేయండి.
బూట్లు లేదా చెప్పులు: శని జయంతి నాడు బూట్లు లేదా చెప్పులు దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది శనికి సంబంధించిన ఇబ్బందులను తొలగిస్తుంది. జీవితంలో అడ్డంకులను తగ్గిస్తుంది. అవసరంలో ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా చెప్పులు లేకుండా ఉన్న వ్యక్తికి వీటిని దానం చేయండి.
దానం ప్రాముఖ్యత
ఎల్లప్పుడూ మీ సామర్థ్యం మేరకు.. పూర్తి భక్తితో దానం చేయండి. చేసిన దానాన్ని రహస్యంగా ఉంచడం మరింత ధర్మం అని భావిస్తారు. నిజంగా అవసరమైన వారికి దానం చేయండి. దానధర్మాలతో పాటు మీరు చేసిన వాటిని గోప్యంగా ఉంచుకోండి, నిజాయితీగా జీవితాన్ని గడపండి. ఎవరికీ హాని చేయకండి. శని జయంతి నాడు ఈ వస్తువులను దానం చేయడం ద్వారా శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అన్ని కష్టాలు, అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








