హిందూ మతంలో ఏకాదశి తిథి ప్రపంచ పోషకుడు విష్ణువుకు అంకితం చేయబడింది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. పురాణ గ్రంథాలలో ఏకాదశి తిథి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఏకాదశి తిథి రోజున లక్ష్మీదేవిని పూజించడం, శ్రీ హరి ప్రార్ధిస్తూ ఉపవాసం ఉండడం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తాడని మత విశ్వాసం. అలాగే ఈ రోజున అన్నదానం, ధనాన్ని దానం చేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. ప్రతి ఏకాదశికి దాని సొంత పేరు, ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం సఫల ఏకాదశిని ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. అయితే సఫల ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించడం వల్ల అన్ని కార్యాలు విజయవంతమవుతాయని, అందుకే దీనిని సఫల ఏకాదశి అని పిలుస్తారని మత విశ్వాసం. 2024 సంవత్సరంలో, ఈ ఏకాదశి 26 డిసెంబర్ 2024 న జరుపుకుంటారు. సఫల ఏకాదశి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో చివరి ఏకాదశి అవుతుంది.
వేద క్యాలెండర్ ప్రకారం, సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 25న రాత్రి 10:29 గంటలకు ప్రారంభమై 27 డిసెంబర్ 2024న మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది.
సఫల ఏకాదశి డిసెంబర్ 26న ఉదయం 7:12 నుంచి 9:16 వరకు జరుపుకుంటారు. ఈ సమయంలో సఫల ఏకాదశి ఉపవాసాన్ని విరమించుకోవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
సఫల ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది.
సఫల ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి,శ్రేయస్సు లభిస్తుంది.
సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.
సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది.
ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
విష్ణువును పూజించాలి. పండ్లు, పుష్పాలను సమర్పించండి.
రోజంతా పండ్లు తినాలి. రాత్రి మేల్కొని జాగారం చేయాలి
నిరుపేదలకు దానం చేయండి. పేదలకు ఆహారం అందించండి.
హిందూ మతపరమైన దృక్కోణంలో ఏకాదశి తిథిలో సఫల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ఉత్తమమైనది. ఫలవంతమైనది. సఫల ఏకాదశికి విజయవంతమైన రోజుగా చాలా ప్రాముఖ్యత ఉంది. సఫల ఏకాదశి అంటే మార్గ శిర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగం కోరుకునే వ్యక్తి విజయం సాధిస్తాడు.
పవిత్రమైన సఫల ఏకాదశి రోజున నారాయణుని పూజించి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. శ్రీకృష్ణ భగవానుడు ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే సఫల ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఆచారాల ప్రకారం సఫల ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠ ధామం పొందుతారు.
సఫల ఏకాదశి రోజున నిష్టతో, భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు , కీర్తనలు పఠించడం, దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.