Samatha Kumbh 2025: కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..

|

Feb 13, 2025 | 9:43 PM

శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు గజ వాహన సేవ చాలా విశిష్టమైనదిగా భావిస్తుంటారు.

Samatha Kumbh 2025: కన్నులపండువగా శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..
Samatha Kumbh 2025
Follow us on

శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆ భగవంతుడి 108 రూపాలతో కలిసి భగవద్రామానుజులకి, మర్యాదగా చేసే ఆచార్య వరివస్య కార్యక్రమం గురువారం కన్నుల పండువగా సాగింది. ఓం సాకేత పురవాసాయ వైకుంఠాయ నమః అంటూ శ్రీరంగనాథుడు పంపిన మర్యాదలను సమతామూర్తికి సమర్పించారు. 108 దివ్యదేశ శ్రీ మూర్తుల రూపంలో.. పెరుమాళ్ల శేషమాలలు, వస్త్రాలను సువర్ణ రామానుజులకు సమర్పించే ఆచార్య వరివస్య కార్యక్రమం వేడుకగా సాగింది.

ఈ 108 దివ్యదేశాలలోని పెరుమాళ్ళ అనుగ్రహం, ప్రేరణలతోనే భగవద్రామానుజులు భక్తి సంప్రదాయాన్ని పునరుద్ధరించి, ప్రచారం చేశారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి.

భద్రవేదిలో వేంచేసి నిత్యారాధనలు అందుకుంటున్న స్వర్ణరామానుజుల వారికి, సమతా ప్రాంగణంలోని 108 దివ్యదేశాల నుండే కాక, దివ్యసాకేత ఆలయాల నుంచి మర్యాద సమర్పణ అత్యంత వైభవోపేతంగా జరిగింది.

అదే సమయంలో శ్రీరామానుజుల తరఫున ఆయా దివ్యదేశ పెరుమాళ్ళకి ఆళ్వార్ల పాశురాలతో దివ్యప్రబంధ స్వాములు మంగళాశాసనములు సమర్పించారు.

వైభవంగా గజవాహన సేవ..

తీర్థగోష్టి పూర్తయ్యాక గరుడ సేవలో వేంచేసిన పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. 18 మంది పెరుమాళ్లకి ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగటం సమతాకుంభ్‌ ఉత్సవాల ప్రత్యేకత..సాయంత్రం సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ జరిగింది. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని శాస్త్ర వచనం..

వీడియో చూడండి..

అంతేకాదు గజ వాహన సేవ చాలా విశిష్టమైనదిగా భావిస్తుంటారు. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. ఏ క్షేత్రంలోనైనా.. గరిష్టంగా 9 లేదా 11 గరుడ వాహన సేవలుంటాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో 18 గరుడ వాహనాలపై 18 మంది దివ్యదేశాధీశుల ఉరేగింపును చూడొచ్చు.

సమతాకుంభ్‌ వార్షికోత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉత్సవాలకు విశేషంగా తరలివస్తున్న భక్తులు.. నిత్యం జరిగే కైంకర్యాలతో పాటు విశేషోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సమతా కుంభ్‌ 2025 -108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఐదో రోజు (14-02-2025) శుక్రవారం ముఖ్య కార్యక్రమాలు

ఉదయం 11 గంటలకు లక్ష్మీపూజ

ఉదయం 11.30 గంటలకు గద్యత్రయ పారాయణము

సాయంత్రం సాకేత రామచంద్రప్రభువుకు అశ్వ వాహన సేవ, 18 గరుడ సేవలు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..