హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఎదురు చుటున్నారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మకరజ్యోతి దర్శనం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయ్యప్ప సన్నిధానంతో పాటు జ్యోతి దర్శనం కనిపించే పంపానది, పులిమేడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామియే శరణం అయప్ప… శరణు ఘోషతో శబరిమల మార్మోగుతోంది. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. నీలక్కల్, పంబ, శబరిగిరులు భక్తజనసందోహంగా మారాయి. కొండ కింద పంబ నుంచి సన్నిదానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
శబరిమల పొన్నాంబలమేడుపై కనిపించే మకరజ్యోతి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా సహా మొత్తం పది పాయింట్ల దగ్గర జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
మకరవిళక్కుకు రోజుకు 80 వేల మంది భక్తులకు ఆన్‌లైన్ స్లాట్లను విడుదల చేశారు అధికారులు. ఇటీవలి వరకూ 20 వేల మందికి స్పాట్ స్లాట్ కూడా ఇచ్చినా మకర జ్యోతి రద్దీ దృష్ట్యా అది కేన్సిల్ చేశారు. 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనానికి తరలివస్తారని అంచనా వేస్తున్న అధికారులు వ్యూహాత్మక ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. మకర జ్యోతి దర్శనం తర్వాత కొండ నుంచి కిందకు దిగే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగినంత వెలుగు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..