Statue of Equality: ముచ్చింతల్‌లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్వనీ కుమార్ చౌబే సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల విశిష్టతను, సమతామూర్తి ప్రాంగణ విశేషాలను వారికి వివరించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. అనంతరం డిజిటల్ గైడ్ ద్వారా రామానుజాచార్యుల జీవితచరిత్రను తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి సహా అతిథులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు:
216 అడుగుల సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా అభివర్ణించారు ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు. ఈ మహత్ కార్యాన్ని విజయవంతం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు భారత ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతున్నానన్నారు వైస్ ప్రెసిడెంట్. సనాతన ధర్మ విప్లవానికి నాందిపలికిన శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు. సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై రామానుజాచార్యులు చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కృషి చేశారన్నారు. కుల, లింగ వివక్షపై వెయ్యేళ్ల క్రితమే పోరాడిన మహనీయులు రామానుజాచార్యులన్నారు ఉపరాష్ట్రపతి. విశిష్ట అద్వైత సిద్ధాంతంతో సమాజంలో వివక్షను పారదోలారన్నారు. కులం కన్నా గుణం మిన్నా అని చెప్పడమే కాకుండా ఆచరణలో చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని, గురువును గుర్తుపెట్టుకోవాలన్నారు వెంకయ్య నాయుడు. పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తిమార్గం ద్వారా జనానికి మంచి మార్గాన్ని చూపించాలన్నారు వెంకయ్య నాయుడు. త్రిదండి చిన్నజీయర్ స్వామి భక్తిమార్గంలో ప్రజలకు మంచి మార్గాన్ని చూపిస్తున్నారని కొనియాడారు. నేటి యువత రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలుసుకోవడమే కాదు వారి మార్గాన్ని ఆచరించాలన్నారు ఉపరాష్ట్రపతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలని సూచించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి 108 దివ్యదేశాలను ఒకేచోట ఏర్పాటు చేసి భక్తులకు గొప్ప బహుమతి ఇచ్చారన్నారు వెంకయ్య. సమతాక్షేత్రం.. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా విజ్ఞాన, సాంస్కృతిక కేంద్రంగా విరజిల్లాలని ఆకాంక్షించారు.
ప్రహ్లాద్ జోషి:
త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత రామేశ్వరరావు, భాస్కర్ రావు ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసి.. అద్భుతం చేశారన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఉత్తరాన ఆదిశంకరాచార్యుల విగ్రహం, దక్షిణాన రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా హిందూ సంస్కృతి పునరుద్ధరణకు నాంది పలికినట్టు అయిందన్నారు. రామానుజాచార్యులు కులాలను రూపుమాపి సమాజంలో సమానత్వాన్ని పెంపొందించారన్నారు ప్రహ్లాద్ జోషి. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని చూస్తుంటేనే స్ఫూర్తి కలుగుతుందన్నారు కేంద్రమంత్రి. భగవద్రామానుజాచార్యుల సమతా సందేశం భవిష్యత్ తరాలకు అందుతుందన్నారు.
గవర్నర్ దత్తాత్రేయ:
భారత్‌కు సమతామూర్తి విగ్రహం శోభాయమానంగా నిలుస్తుందన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు అంటరానితనం, కుల వివక్షపై పోరాడారన్నారు. రామానుజాచార్యులు మానవునిలోనే మాధవుడు ఉన్నాడని ఆనాడే చెప్పిన మహనీయుడన్నారు దత్తాత్రేయ. దైవభక్తి, దేశభక్తి భారత్‌కు కవచాల లాంటివన్నారు. ఆధ్యాత్మికత లేకపోతే భారతదేశం లేదన్నారు. మనదేశంలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు రామానుజాచార్యులు విశేష కృషిచేశారన్నారు హర్యానా గవర్నర్. జీయర్ ట్రస్ట్ ద్వారా త్రిదండి చిన్నజీయర్ స్వామి ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నారన్నారు కొనియాడారు దత్తాత్రేయ.
మహమూద్‌అలీ:
తెలంగాణలో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతా మూర్తిపై ప్రపంచమంతా మాట్లాడుకోవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు విగ్రహ ఏర్పాటు కోసం అహర్నిషలు కృషి చేశారన్నారు.
అటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకున్నారు . 108 దివ్యదేశాలను సందర్శించారు. వారికి ఆలయ విశేషాలను వివరించారు మైహోంగ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు.
మెగాస్టార్ చిరంజీవి:
సమతామూర్తిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు మెగాస్టార్ చిరంజీవి. సమతామూర్తి భారీ విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతమన్న ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు అక్షరసత్యమన్నారు మెగాస్టార్. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు ఇద్య భరత నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషిజ, అశ్వనీకుమార్ చౌబే, త్రిదండి చిన్నజీయర్ స్వామి, మెగాస్టార్ చిరంజీవి.. జూపల్లి ఇద్య నాట్యం చూసి మంత్రముగ్దులయ్యారు. జూపల్లి ఇద్య భరత నాట్యం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
రేపటి కార్యక్రమాలు:
120 కిలోల రామానుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి ప్రాగణంలో 19 దివ్యదేశ ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం జరుగునుంది. యాగశాలలో విజయప్రాప్తికై విశ్వక్సేన ఇష్టి, జ్ఞానజ్ఞానాకృత సర్వవిధ పాప నివారణకై శ్రీమన్నారాయణ ఇష్టి, పెరుమాళ్‌కు పుష్పార్చన, ప్రవచన మండపంలో కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
Also read:
Andhra Pradesh: పంచ పాండవుల్లా ఉద్యమ పిడికిలి బిగించిన ఆ ఐదు గ్రామాలు.. ఎందుకో తెలుసా?
Chanakya Niti: సంపద శ్రేయస్సు కోసం మనిషి ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకోవాలంటున్న చాణక్య..
Karnataka Hijab Row: అంతర్జాతీయ స్థాయికి హిజాబ్ ఇష్యూ.. అగ్రరాజ్యం అమెరికా ఏమన్నదంటే..?