Ramadan Moon Sighted in India: ముస్లీంలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనపించడంతో ఆదివారం తెల్లవారు జాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలను ప్రారంభించారు. రంజాన్ (Ramzan )నెల ఆరంభం నుంచి ముస్లీంలు 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. వేకువ జామునే నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు. దీన్నే సహర్ అంటారు. ఆతర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారు. ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనంలో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ముస్లింలు చేసే ప్రార్థన (నమాజ్) మానసిక పరివర్తన తెస్తుంది. నిర్మల మనసుతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత నేర్పుతుంది. ఇందులో భాగంగా రాత్రివేళ చేసే ఇషా నమాజ్ తరువాత 30 రోజుల రంజాన్ మాసంలో ప్రత్యేక తరావీ నమాజ్ కూడా చేస్తారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు ముస్తాబయ్యాయి. కాగా.. తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చింది. గంట ముందు.. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కలిపించింది. రంజాన్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.చందరశేఖర్రావు (CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సీఎం ఆకాంకింక్షారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సీఎం కేసిఆర్ అభిలాషించారు.
సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు..
రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పేర్కొన్నారు.
Also Read: