AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

ప్రాణహిత పుష్కర శోభను సంతరించుకుంది. ఇవాళ్టి నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈనెల 13 నుండి 24ల వరకూ పుష్కరాలు కొనసాగనున్నాయి.

Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..
Pranahita Pushkaralu
Sanjay Kasula
|

Updated on: Apr 13, 2022 | 7:45 AM

Share

ప్రాణహిత పుష్కర(Pranahita Pushkaralu) శోభను సంతరించుకుంది. ఇవాళ్టి నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈనెల 13 నుండి 24ల వరకూ పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట పుష్కర ఘాట్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిందటిసారి 2010 డిసెంబరులో నిర్వహించగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కర కళ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజూ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని..అసలు ప్రాణహిత పుష్కరాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి దుర్గ స్టాలిన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు రవిశంకర్‌ గురూజీ, కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితోపాటు పలువురు స్వామీజీలు పుష్కరాలకు రానున్నట్లు తెలిసింది.

తెలంగాణ- మహారాష్ట్ర మీదుగా..

వార్ధా-పెన్‌గంగా నదుల కలయికతో కొమురంభీంజిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద పురుడుపోసుకున్న ప్రాణహిత 3 జిల్లాలు , 3రాష్ట్రాల సరిహద్దులను ముద్దాడుతూ 113 కిలోమీటర్లు గలగలపారుతూ త్రివేణి సంగమంలో అంతర్థానం అవుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, అటు మహారాష్ట్ర వైపు సిరోంచ , నగరం వద్ద పుష్కరాలు కొనసాగనున్నాయి.

పుష్కర స్నానాలు..

ఈనెల 13 నుంచి 24 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు కొనసాగుతాయి. ఈ 12 రోజులు ప్రాణహిత నది తీరం, త్రివేణి సంగమం భక్తజన జాతరగా మారనుంది. మహారాష్ట్ర సిర్వంచ , తెలంగాణ అర్జునగుట్ట వద్ద రోజుకు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ అర్జునగుట్ట వద్దకు వెళ్లేందుకు బబ్బెరిచెలక నుంచి రహదారిని సిద్ధం చేశారు.

వీఐపీల కోసం హెలిప్యాడు..

వీఐపీల కోసం జైపూర్ ఎస్టీపీపీలో హెలిప్యాడు కూడా సిద్ధం చేశారు అదికారులు. వేమనపల్లి, తుమ్మిడి హెట్టి ఘాట్లకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరాలు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసింది అక్కడి శివసేన సర్కార్. అక్కడి ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు రూ. 10 కోట్లు కేటాయించింది. మరోవైపు ప్రాణహిత పుష్కరాల నేపథ్యంలో పలు ప్రాంతాల నుండి ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడుపుతోంది.

తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్‌కు మరమ్మతులు పూర్తిచేశారు. పార్కింగ్‌ స్థలం వద్ద బారికేడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పిండప్రదానాల కోసం షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులను సిద్ధం చేశారు. అర్జునగుట్ట వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శ్రాద్ధ మండపాలు, కేశఖండన శాలలు, నదిలో ప్రమాదాలు జరగకుండా కంచె, చెన్నూరు నుంచి 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ భారతి హోళ్లికేరి మంగళవారం పరిశీలించారు.

కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్తు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. 36 షవర్లు, దుస్తులు మార్చుకునేందుకు రెండు షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూడు చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..

Telangana Cabinet: ఇంటర్వూ లేకుండానే గ్రూప్ 1,2 ఉద్యోగాలు.. పోలీసు అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు