Jagannath Temple Treasury: శ్రీక్షేత్రం సంపద లెక్కింపుపై వివాదం నెలకొంది. ప్రపంచంలో ప్రసిద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందిన ఒడిశాలోని పూరీక్షేత్రంలోని రహస్య సంపదలున్న రత్న భాండాగారం గది తాళం చెవి మిస్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ విషయం ఇటీవల సమాచార హక్కు కింద వివరాలు కోరడంతో బహిర్గతమైంది. ఈ రత్న భాండాగారం గదుల తలుపులు చివరిసారిగా 1978లో తెరిచారు. అయితే అప్పుడు సంపద లెక్కింపు జరిగినా వివరాలు ప్రస్తుతం ఆలయ యంత్రాంగం వద్ద లేకపోవడంతో భక్తుల్లో అలజడి నెలకొంది. 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఇతర విలువైన విలువైన రత్నాలు, రాళ్లు గుర్తించినట్లు సమాచారం. రత్న భాండాగారం లోని మొత్తం సంపద విలువకు సంబంధించి వివరాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు అప్పటి ప్రభుత్వం సంపద వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
అయితే 2018 లో పూరి రత్న భాండాగారం లెక్కలపై తీవ్ర విమర్శలు వినిపించాయి. దీంతో 17 మంది నిపుణులు, ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. అయితే రత్న భాండాగారం చీకటిగా ఉండడంతో గదుల్లోకి వెళ్ళడానికి పూజారులు, అధికారులు భయపడ్డారు. చివరకు 2018 ఏప్రిల్ 18న ఆక్సిజన్, టార్చ్ లైట్ల, స్నేక్ స్నాచర్లు వెంటరాగా రత్నభాండాగారంలో తొలి రెండు గదుల్లోకి కమిటీ సభ్యులు వెళ్లారు. అప్పుడు జగన్నాధుడి నిత్యసేవలకు ఉపయోగించే బంగారం, వజ్ర వైడూర్యం, గోమేదిక, పుష్పరాగాలు కెంపులు తదితర ఆభరణాలున్న తొలి రెండు గదులను మాత్రమే కమిటీ సభ్యలు పరిశీలించారు. తాళం చెవి లేని కారణంగా కమిటీ సభ్యులు మూడో గదిలోకి వెళ్లలేకపోయారు. అయితే రత్నభాండాగారం గదులు బలహీనంగా ఉన్నాయని మరమ్మతులు చేయాలని సూచించారు.
రత్నభాంఢాగారం రక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని న్యాయశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ రఘవీర్ దాస్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఆలయంలో అపూర్వ సంపద నిక్షిప్తమైనట్లు గుర్తించారు. మొత్తం ఏడు రహస్య గదుల్లో సంపద ఉన్నట్లు భావిస్తున్నారు. తాళం చెవి మిస్ కావడంతో సంపద లెక్కింపు అడ్డుతగిలింది.
అయితే కలెక్టర్ కార్యాలయం ట్రెజరీలో డూప్లికేట్ తాళం చెవి ఉందని అప్పటి కలెక్టర్ అరవింద అగర్వాల్ చెప్పారు. అనంతరం రఘువీర్ దాస్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికీ ఆ కమిటీ నివేదికను ఒడిశా ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. అయితే మరోవైపు నివేదిక వెల్లడించాలని విపక్షాలు, భక్తులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
అప్పటినుంచి మరుగున పడిపోయిన రత్నభాండాగారం సంపద వివరాలు 2021లో ఆర్టీఏ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అసలు తాళం చెవి ఎటుపోయింది? డూప్లికేట్ తాళం చెవి ఎలా తయారు చేశారు? మరోవైపు ఇప్పటికీ డూప్లికేట్ తాళం చెవి ఎక్కడ ఉంది అనేవి సమాధానంలేని బేతాళ ప్రశ్నలుగా మిగిలిపోయి. పూరికి చెందిన జగన్నాథుడి భక్తుడు దిలీప్ చొరాల్ తాళం చెవి ఎక్కడుందో తెలియజేయాలంటూ ఆర్టీఏకు దరఖాస్తు చేశారు. ఆ వివరాలను 2021 నవంబర్ 20న పూరీ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్(ఏడీఎం) వివరాలు అందజేశారు. పూరీ కలెక్టర్ కార్యాలయంలో తాళం చెవి లేదని తెలిపారు. అంతేకాదు అది ఎక్కడుందో తెలియదని స్పష్టం చేశారు.
తాజాగా తాళం చెవి లేదని చెప్పడంతో భక్తులు, రాజకీయ పక్షాల్లో తాజాగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రత్న భాండాగారం గురించి నిజాలు తెలియాలని, అప్పటి కలెక్టర్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం శ్రీక్షేత్ర పాలనా వ్యవహారాలు విస్మరిస్తోందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పంచానన్ కానుంగో విమర్శించారు.
శ్రీక్షేత్ర దైతాపతి సేవాయత్ సంఘ్ ఉపాధ్యక్షుడు వినాయక్ దాస్ మహాపాత్ర స్వామి సంపద లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. రత్న భాండాగారం గదుల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.
Also Read: నల్లతాచుపాముకు గ్లాసుతో నీరు పట్టించిన యువకుడు..ఆత్రంగా దాహం తీర్చుకున్న పాము.. వీడియో వైరల్..