Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharata: నాకు ఎదురే లేదు అంటూ గర్వం, అహంకారంతో రాజ్యపాలన చేస్తే.. ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయో పరశురాముడు చెప్పిన నీతి కథ

Moral Story In Mahabharath: పాత రోజుల్లో అమ్మమ్మలు , నానమ్మలు, తాతయ్యలు ఆరు బయట వెన్నెల్లో చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని.. చందమామను, తళుకుబెళుకు నక్షత్రాలను చూపుతూ..

Mahabharata: నాకు ఎదురే లేదు అంటూ గర్వం, అహంకారంతో రాజ్యపాలన చేస్తే.. ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయో పరశురాముడు చెప్పిన నీతి కథ
Mabharata Moral Story
Follow us
Surya Kala

|

Updated on: Sep 05, 2021 | 8:40 AM

Moral Story In Mahabharath: పాత రోజుల్లో అమ్మమ్మలు , నానమ్మలు, తాతయ్యలు ఆరు బయట వెన్నెల్లో చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని.. చందమామను, తళుకుబెళుకు నక్షత్రాలను చూపుతూ.. ఎన్నో అద్భుతమైన కధలు చెప్పేవారు. అనగనగా..ఒకరాజంటూ ..ఉత్సాహవంతమైన రాజకుమారుల కధలు, మాయలు మంత్రాల కధలూ. నీతికధలు, పేదరాసి పెద్దమ్మ కధలు, సాహస వీరుల కధలు, రామాయణ మహాభారతం కధలు..ఇలా ఒక్కటేమిటి..పిల్లలకు తమ భావిజీవితాలకు అవసరమైన ఎన్నో..ఎన్నెన్నో మంచి విషయాలను కధల రూపంలో చెప్పేవారు. అలాంటి ఉన్నతమైన భావాలను కధారూపంలో విన్న బాలలు తామూ అలా ఎదగాలని అప్పటినుండే తమ వ్యక్తిత్వాలకు మెరుగు దిద్దుకొనేవారు. ఈరోజు మహాభారతంలోని ఉద్యోగపర్వంలో  గర్వం, అహంకారం ఇంటివారినైనా నాశనం చేస్తాయని పరశురాముడు.. దుర్యోధనుడితో చెప్పిన కథ గురించి తెలుసుకుందాం..

శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి హితవు చెప్పినా వినని కౌరవులను చూసి పరశురాముడు…  “నాయనా దుర్యోధనా ! నీకు నీ వారికి మేలు చేయగల కథ ఒకటి చెబుతాను విను. పూర్వం దంభోద్భవుడు అనే పేరుగల రాజు వుండేవాడు. అతడు ఈ భూమండలమంతా పరిపాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో అతడికి సాటి రాగల వారెవరూ లేనంతటి మహాయోధుడాయన. ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు ముగించి, బాగా అందంగా అలంకరించుకుని, రత్నకిరీటం ధరించి కోడెత్రాచు వంటి తన కరవాలం చేత బట్టి సభా భవనానికి విచ్చేసి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు.  వందిమాగదులు తన బలపరాక్రమాలను కీర్తిస్తుంటే విలాసంగా వింటూ దంభోద్భవుడు ఆనందించేవాడు. రోజూ సభాసదులను చూస్తూ “ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా .. ? గదా ఖడ్గ ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడున్నా వాడిని ఇట్టే కడతేరుస్తాను” అని గర్వంగా నవ్వి భుజాలు ఎగరేసేవాడు.
అయితే దంభోద్భవుడు బలాపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కాదు. దీంతో రాజులో అహంకారం రోజు రోజుకీ పెరుగుతూవచ్చింది. దానికితోడు.. అనుచరులు కూడా అనుక్షణం దంభోద్భవుడు బలం గురించి పొగుడుతూ ఆ గర్వాన్ని మరింత పెంచారు. ఒకరోజు దర్బారుకు దూరదేశం నుండి కొందరు విప్రులు వచ్చారు. వారు ఈ తతంగమంతా చూసి.. “మహారాజా దంభోద్భవుడు .. మీరు నిజంగా మహా వీరులే బలపరాక్రమ సంపన్నులే.. అయితే గంధమాదన పర్వతం మీద నర నారాయణులని ఇద్దరు వ్యక్తులు నియనిష్ఠలతో తపస్సు చేసుకుంటున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాల్లో లేరని విన్నాం. తమకు యుద్ధం చేయాలనే కోరికవుంటే వారితో యుద్ధం చేయవచ్చు” అన్నారు.
విప్రుల నోట తనకంటే వీరుల గురించి మాట వినటంతోటే దంభోద్భవుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నన్ను మించిన వీరులా” అంటూ కత్తి ఝళిపించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. సేనలతో సహా ‘గంధమాదన పర్వతం’ చేరుకున్నాడు. ప్రశాంత వనంలో తపస్సు చేసుకుంటున్న నర నారాయణులను చూసి తొడగొట్టి యుద్ధానికి పిలిచాడు. అయితే నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన రాజుకు అతిథి సత్కారాలు జరుపబోగా
“అవన్నీ అనవసరం యుద్ధం యుద్ధం” అని అట్టహాసం చేసాడు. రాజు మాటలను విన్న నర నారాయణులు “మహారాజా .. ఎవరితోనూ సంబంధం లేకుండా మేము కళ్లుమూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం. మాతో యుద్ధం చేయాలనే కోరిక నీకెందుకు కలిగింది”  అన్నారు. అయినా రాజు మునుల మాటలను వినలేదు.. సరికదా తనతో  “యుద్ధం చెయ్యాల్సిందే .. అంటూ పట్టుబట్టాడు. విల్లు ఎక్కుపెట్టాడు.
రాజు తీరుకు.. నరుడు నవ్వుతూ ఒక  దర్బను తీసుకుని “ఇదిగో రాజా.. ఈ గడ్డిపరక ఒక్కటి చాలు నీ సైన్యాన్ని నిలబెడుతుంది” అంటూ వదిలాడు.
ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. సైనికులందరూ ముక్కలూ చెవులూ తెగిపోయి రోదన ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు పలాయనం ప్రారంభించాయి. అది చూసిన రాజుకి గుండె జారింది. వీరు సామాన్యులు కాదని గ్రహించిన రాజు ఆయుధాలు కింద పడేసి, నర నారాయణుల పాదాలపై వాలి… “ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది” అని దీనంగా ప్రార్దించాడు.
అప్పుడు నరనారాయణులు నవ్వుతూ “మహారాజా ! సిరి సంపదలు కలవారు పేదసాదలకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు వున్నవారు దుర్మార్గుల బారినుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చెయ్యనివాడి జన్మ వ్యర్ధం” అన్నారు.  దీంతో దంభోద్భవుడు మహారాజు తన అహంకారం విడిచి అందరి శ్రేయస్సూ దృష్టిలో వుంచుకుని పాలన కొనసాగించాడు. తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను కౄరులను శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.  కనుక దుర్యోధనా ! అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి  ఉంటాయో వారి జీవితాన్ని నాశనం చేస్తాయని దుర్యోధనుడితో పరశురాముడు చెప్పాడు.