Multibagger Stock: లక్ష పెట్టుబడితో 93 కోట్ల రాబడి.. ఆ మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకోవాల్సిందే..!
భారతదేశ జనాభాలో చాలా మంది ప్రజలు పెట్టుబడి వైపు ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా యువత ఇటీవల కాలంలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. అయితే గతంలో భారతీయులు స్థిర ఆదాయ పథకాలైన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడితే మారిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీలో పదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం 93 కోట్లకు చేరింది. ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చే ఇలాంటి పెన్నీ స్టాక్‌లు చాలా ఉన్నాయి. అయితే అవి సాధారణ పెట్టుబడిదారుల దృష్టిని అంతగా ఆకర్షించవు. 11 సంవత్సరాల కాలంలో రూ. లక్ష పెట్టుబడిని రూ. 93 కోట్లకు పెంచిన స్టాక్ ఉందని చాలా మందికి తెలియదు. ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ బీఎస్ఈ డేటా ప్రకారం 10 సంవత్సరాలలో 9385.23 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఈ విధంగా చూస్తే ఎవరైనా 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు అది రూ.93,85,23,000కి పెరిగి ఉండేది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 160 శాతం లాభపడింది. అయితే ఈ ఏడాది జనవరి నుండి ఈ స్టాక్ 30 శాతానికి పైగా పడిపోయింది.
ఇటీవల ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ షేరు ధర 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.2,086.75 వద్ద ముగిసింది. అదే సమయంలో గత 6 నెలల్లో 39.82 శాతం తగ్గుదల కనిపించింది. అదే సమయంలో దాని 52 వారాల గరిష్ట స్థాయి రూ. 4,878.60కు చేరింది. అందువల్ల ఇది దాని ఒక సంవత్సరం గరిష్ట స్థాయి కంటే 42.77 శాతం దిగువన ట్రేడవుతోంది. అయితే మార్కెట్‌లో కొనసాగుతున్న తిరోగమనంలో కూడా ఈ స్టాక్ గత వారంలో 21 శాతానికి పైగా లాభపడింది. ఈ కంపెనీ ఫండమెంటల్ రంగంలో బలంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం, లాభాలు స్థిరంగా పెరుగుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆదాయం రూ.30.72 కోట్లుగా ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.57.33 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నికర లాభం కూడా రూ.1.33 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం, లాభాల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి త్రైమాసికంలో కంపెనీ అత్యధికంగా రూ.21.57 కోట్ల ఆదాయాన్ని, రూ.2.97 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ. 19.87 కోట్ల ఆదాయాన్ని రూ. 1.37 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత నెలలో ఒడిశా క్యాబినెట్ భువనేశ్వర్‌లో భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ (ఎస్ఐసీ) సెమీకండక్టర్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు ప్రోత్సాహక ప్యాకేజీని ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు రూ.618.60 కోట్ల పెట్టుబడి అవసరం. అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి