AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalitha Panchami: లలితా పంచమి రోజు అమ్మవారిని ఇలా పూజించండి.. సువాసిని పూజతో విశేష ఫలితాలు!

Lalitha Panchami Puja Telugu: లలితా పంచమి 2026 అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవిని ఎలా పూజించాలి? సువాసిని పూజ ప్రాధాన్యం, నైవేద్యాలు, పఠించాల్సిన మంత్రాలు, లలితాదేవి ఆవిర్భావ పురాణగాథ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Lalitha Panchami: లలితా పంచమి రోజు అమ్మవారిని ఇలా పూజించండి.. సువాసిని పూజతో విశేష ఫలితాలు!
Lalitha Panchami Puja Telugu
Rajashekher G
|

Updated on: Oct 15, 2026 | 8:58 AM

Share

Navratri: శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు. ఒక్కో రోజూ ఒక్కో రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో నవరాత్రుల్లో ఐదో రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష పంచమి తిథిని లలితా పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున ఆదిశక్తి స్వరూపమైన శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి లలితా సహస్రనామం పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

లలితా పంచమి ఎప్పుడు?

ఆశ్వయుజ శుక్లపక్ష పంచమి తిథినే లలితా పంచమిగా పిలుస్తారు. 2026లో అక్టోబర్ 15, గురువారం లలితా పంచమి పర్వదినం వచ్చింది. శరన్నవరాత్రుల్లో వచ్చే ఈ పంచమి తిథిని అమ్మవారి ఆరాధనకు అత్యంత అనుకూలమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఈ రోజున లలితాదేవి నామస్మరణ, స్తోత్ర పారాయణం, కుంకుమార్చన, సువాసిని పూజ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

లలితాదేవి ఎలా అవతరించారు?

లలితా త్రిపురసుందరీదేవి ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఉంది. పరమేశ్వరుని త్రినేత్రం నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు మన్మథుడు దహించబడ్డాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మన్మథుడి భస్మం నుంచి భండాసురుడు అనే అసురుడు జన్మించాడు. భండాసురుడు అపారమైన శక్తిని సంపాదించి దేవతలను, ఋషులను, మునులను వేధించడం ప్రారంభించాడు. అతడి కారణంగా ముల్లోకాల్లో అశాంతి నెలకొంది. దీంతో దేవతలంతా ఆదిశక్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు ప్రసన్నమైన జగన్మాత *లలితా త్రిపురసుందరీదేవి’గా అవతరించి భండాసురుడిని సంహరించిందని పురాణ కథనం. దేవతలకు అభయం ఇచ్చి ముల్లోకాలను రక్షించిన అమ్మవారిని స్మరించుకుంటూ లలితా పంచమిని జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

లలితా పంచమి రోజు పూజా విధానం

లలితా పంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. సంప్రదాయాన్ని పాటించేవారు వీలైతే నదీస్నానం చేయవచ్చు. అనంతరం పూజా మందిరంలో లలితాదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవునేతితో దీపం వెలిగించాలి. పసుపు రంగు చేమంతులు, ఎరుపు గులాబీలు, మందారాలు, కనకాంబరాలతో అమ్మవారిని అలంకరించవచ్చు. లేత నారింజ రంగు వస్త్రాన్ని సమర్పించి, పుష్పాలు, అక్షింతలతో పూజ చేయాలి. లలితా సహస్రనామం, లలితా పంచరత్నం, లలితా పంచవింశతి నామ స్తోత్రం వంటి పారాయణాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అమ్మవారికి కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలను సమర్పించవచ్చు. పూజ అనంతరం భక్తులు ప్రసాదాన్ని స్వీకరించాలి.

సువాసిని పూజ ఎందుకు చేస్తారు?

లలితా పంచమి రోజున సువాసిని పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి ఇంటికి ఆహ్వానించి పూజిస్తారు. ముందుగా వారి పాదాలకు పసుపు పూసి, పారాణి పెట్టి, భోజనం పెట్టి సత్కరిస్తారు. అనంతరం పసుపు, కుంకుమ, గాజులు, పూలు, తమలపాకులు, పండ్లు, చీర, రవికె వంటి సుమంగళి ద్రవ్యాలను అందిస్తారు. ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుంటారు.

ఈ మంత్రాన్ని జపించండి

లలితా పంచమి రోజున ‘ఓం శ్రీ మాత్రే నమః’ అనే మంత్రాన్ని భక్తితో జపించడం విశేషంగా భావిస్తారు. అలాగే ‘సచామర రమావాణి సర్వ దక్షిణ సేవితా’ అనే నామాన్ని 108 సార్లు పఠించవచ్చని భక్తుల విశ్వాసం. లలితా త్రిపురసుందరీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే.. అమ్మవారి అనుగ్రహం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వాసం.

(Disclaimer: పూజా విధానాలు, మంత్ర జపం, పూజాఫలితాలకు సంబంధించిన అంశాలు సంప్రదాయాలు, పురాణ విశ్వాసాల ఆధారంగా ఉంటాయి. ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ సంప్రదాయాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us