AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!

Durga Puja Rituals: దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు? మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించే ఈ వేడుకల్లో షష్ఠి నుంచి విజయదశమి వరకు ప్రత్యేక పూజలు, ఆచారాలు ఉంటాయి. అమ్మవారి ఆరాధన, నవపత్రిక పూజ, పుష్పాంజలి, సిందూర్ ఖేలా సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకుందాం.

దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
Durga Puja Significance
Rajashekher G
|

Updated on: Oct 14, 2026 | 3:55 PM

Share

Durga Puja Significance: హిందూ సంప్రదాయంలో దుర్గాపూజకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు కేవలం పూజలు, సంప్రదాయాలకే పరిమితం కావు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని, దైవశక్తి గొప్పతనాన్ని, కుటుంబ బంధాల్లోని ఆప్యాయతను చాటిచెబుతాయి. 2026లో దుర్గాపూజ ప్రధాన వేడుకలు అక్టోబర్ 16న మహా షష్ఠితో ప్రారంభమై, అక్టోబర్ 21న విజయదశమితో ముగుస్తాయి.

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

హిందూ పురాణాల ప్రకారం, మహిషాసురుడు అనే రాక్షసుడు తన శక్తితో దేవతలను ఇబ్బందులకు గురిచేశాడు. అతడిని ఓడించేందుకు దేవతలందరి దివ్యశక్తులు కలిసి దుర్గాదేవి రూపంలో అవతరించాయని పురాణ కథనాలు చెబుతాయి. సింహవాహనంపై ఆశీనురాలైన అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేసి అతడిని సంహరించారు. ఈ కథ అహంకారం, అన్యాయం, దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. బెంగాలీ సంప్రదాయంలో దుర్గాదేవిని పార్వతీదేవి స్వరూపమైన ఉమాదేవిగా భావిస్తారు. ఆమె తన పిల్లలైన గణేశుడు, కార్తికేయుడితో కలిసి పుట్టింటికి వచ్చిన ఆడపడుచుగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే అమ్మవారి రాకను ఆనందంగా స్వాగతించడంతో పాటు, తిరిగి వెళ్లే సమయంలో భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతారు.

షష్ఠి నుంచి దశమి వరకు జరిగే పూజా విశేషాలు

  • మహా షష్ఠి: దుర్గాపూజలో తొలి ప్రధాన రోజు ఇది. బోధన్, ఆహ్వాన్, అధివాస్ వంటి సంప్రదాయ ఆచారాలతో అమ్మవారిని ఆహ్వానిస్తారు. అనేక ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ఉత్సవ సందడి మొదలవుతుంది.
  • మహా సప్తమి: ఈ రోజున నవపత్రిక పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తొమ్మిది రకాల మొక్కలతో నవపత్రికను సిద్ధం చేసి పూజిస్తారు. ప్రకృతిలోని దైవశక్తికి, సృష్టికి, సంతానోత్పత్తికి ఇది ప్రతీకగా భావిస్తారు.
  • మహా అష్టమి: దుర్గాపూజలో అత్యంత పవిత్రమైన రోజులలో అష్టమి ఒకటి. భక్తులు పుష్పాంజలి సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. కొన్ని సంప్రదాయాల్లో కుమారీ పూజ నిర్వహిస్తారు. అష్టమి, నవమి తిథుల సంధికాలంలో జరిగే సంధిపూజకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది.
  • మహా నవమి: ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అనేక ప్రాంతాల్లో హోమాలు, హవనాలు నిర్వహించి దుర్గాదేవి ఆశీస్సులు కోరుకుంటారు.
  • విజయదశమి: దుర్గాపూజ ఉత్సవాలకు ఈ రోజుతో ముగింపు పలుకుతారు. బెంగాల్‌లో వివాహిత మహిళలు సిందూర్ ఖేలా సంప్రదాయంలో పాల్గొంటారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసి వీడ్కోలు చెబుతారు. “ఆషే బోచోర్ ఆబార్ హోబే” అంటే వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం అనే భావంతో అమ్మవారికి వీడ్కోలు పలుకుతారు.

పండుగలో ఆనందం.. వీడ్కోలులో భావోద్వేగం!

దుర్గాపూజలో అమ్మవారి రాక భక్తుల్లో ఆనందాన్ని నింపితే, ఆమె నిమజ్జనం భావోద్వేగానికి గురిచేస్తుంది. దైవశక్తిపై విశ్వాసం, కుటుంబ అనుబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఈ ఐదు రోజుల పండుగలో మిళితమై ఉంటాయి. చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని అందించే దుర్గాపూజ.. భక్తులకు ధైర్యాన్ని, ఆశను, ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించే పవిత్రమైన ఉత్సవంగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న దుర్గాపూజ విశేషాలు హిందూ పురాణాలు, సంప్రదాయాలు, స్థానిక మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతాలను బట్టి పూజా విధానాలు, ఆచారాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us