Srisailam Temple Timings: శ్రీశైల దేవస్థానం దర్శన వేళల్లో మార్పులు.. సాయంత్రం 3గంటల వరకు భక్తులకు అనుమతి..
దేశవ్యాప్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయం దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది.
Srisailam Temple Timings: దేశవ్యాప్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయం దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దర్శన వేళల్లో మార్పులు చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజా కైంకార్యాలు, పరోక్షాసేవలు యథావిధిగా కొనసాగనున్నట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. క్షేత్ర పరిధిలో దుకాణాలు సాయంత్రం 4 వరకు తెరిచేందుకు దేవస్థానం అనుమతించింది.
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన ఇదిలావుంటే ఇవాళ శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుదూరం నుంచి భక్తులు మొక్కు చెల్లించేందుకు వస్తే కల్యాణకట్టను మూసివేయటం ఏంటని, వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ తలనీలాల సమర్పణకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని భక్తులకు సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు. కోవిడ్ దృష్ట్యా గత నెల కల్యాణకట్టను ఆలయ అధికారులు మూసివేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం నేటి నుంచి కర్ఫ్యూవేళలను సడలించడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Also…