భారతదేశంలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రహస్య ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభు ఆలయాలు కాగా.. మరికొన్ని మనవ నిర్మిత ఆలయాలు.. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయి. అయితే చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయల్పడుతూ గతవైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రస్తావన రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా కల్కిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ చారిత్రాత్మక ఆలయం గురించి తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పబడింది.
ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850 వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది. అంతేకాదు పెన్నా నదికి వచ్చే వరదలు గ్రామాలను ముంచెత్తడంతో 200 ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్రమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు
ఇసుక తవ్వకాల్లో బయల్పడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌కి సంబంధించి మళ్ళీ ఈ ఆలయ ప్రస్తావన ఉందని.. ఓ వార్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..