శ్రీరామచంద్రమూర్తి , సీతమ్మ వారు అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో ఆయన ఒంటిమిట్ట తరువాత వెయ్యినూతల కోన ప్రదేశానికి వస్తారు… అక్కడ ఒక కొండపై ఆయన కొంతకాలం నివసిస్తారు .. అది కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఉన్న వెయ్యినూతల కోన వద్ద ఉంది. ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారితో ఉన్నప్పుడు వారు చాలా ఆనందంగా తమ అరణ్యవాసాన్ని గడుపుతూ ఉంటారు… ఆ సమయంలో దేవతలంతా శ్రీరామచంద్రుడికి అసలు కోపం రాదా ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటారా అని ఆలోచన వచ్చి రాములవారికి కోపం తెప్పించడానికి ఇంద్రుడి కుమారుడైన కాకాసురుడని సీతమ్మ వారి దగ్గరికి కాకీ రూపంలో పంపించి వారిద్దరి ఆనందానికి భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తారు.
ఆ సమయంలో సీతమ్మ అక్కడ ఉన్న చిన్న మట్టి గడ్డను కాకిపైకి విసరడంతో ఆ కాకి సీతమ్మ వారి వక్షోజాల మీద వాలి గాయపరుస్తుంది… దాంతో బాధ కలిగిన సీతమ్మ మరికొంత కోపంగా కాకిపైకి తన వడ్డాణాన్ని విసురుతుంది అని పురాణాలు చెబుతున్నాయి… ఆ తరువాత సీతమ్మవారు రాములవారి ఒడిలో పడుకుంటారని కొంత సమయం తర్వాత సీతమ్మవారు ఒడిలో రాములవారు పడుకున్న సమయంలో మరోసారి కాకి వచ్చి సీతమ్మవారిని గాయపరిచిన చోటే మరోసారి గాయపరచడంతో రక్తం కారి శ్రీరాముల వారి నుదుటిమీద పడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు ఆ రక్తాన్ని చూచి చలించిపోయి గాయపరిచిన కాకిపై బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు… ఇది గ్రహించిన కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరామచంద్రుల వారి వద్దకే వచ్చి కాళ్ళ మీద పడి పశ్చాత్తాప పడుతుంది … ఆ సమయంలో శ్రీరాముల వారు కాకిని క్షమిస్తారు .. కానీ వదిలిన బ్రహ్మాస్త్రంకు ఏదో ఒకటి బలి కావాలి కాబట్టి కాకి తన కన్నును బలిగా ఇస్తుంది.. ఆ తరువాత శ్రీరాముల వారు ఈ ప్రదేశంలో ఇక నువ్వు కనిపించకూడదు అని కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రంతో ముద్ర వేస్తారు .. అందుకే ప్రస్తుతం ఉన్న వెయ్యినూతల కోన పరిసర ప్రాంతాలలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించిన స్థల పురాణం కూడా ఆ దేవాలయం వద్ద ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..