చలి కాలం వచ్చిందంటే.. కార్తీక మాసం వచ్చినట్టే. నెల రోజులు శివయ్యను తలుచుకుంటే చేసే స్నానాల్లో, పూజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెల వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తినడం మానేసి.. పూజలు చేస్తూంటారు. హిందూ పండుగల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. కార్తీక మాసం వచ్చిందంటే తెల్లవారు జామునే లేచి స్నానాలు చేసి పూజలు చేస్తూంటారు. ఈ నెల రోజులు చలిని శరీరంలో తట్టుకుంటే.. కొత్త ఉత్తేజితంగా మారుతుందని పెద్దలు చెబుతూంటారు.
కొత్త ఉత్తేజం వస్తుంది:
ప్రతి రోజూ చేసే స్నానం వేరు. కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు పెద్దలు. సాధారణంగా చలికి ఉదయం త్వరగా లేవలేం. బద్ధకంగా ఉండి.. ఏ పని చేయాలనిపించదు. అందుకే వేకువ జామునే లేచి స్నానాలు చేయడం వల్ల బద్ధకం వదిలి.. కొత్త ఉత్తేజం వస్తుంది. అంతే కాదు పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి:
అంతే కాకుండా వేకువ జామునే లేవడం వల్ల అన్ని పనులు త్వరగా పూర్తి అయిపోతాయి. అలాగే ఉదయాన్నే లేచి నడవటం కూడా ఓ చక్కటి వ్యాయామం. పైగా నదీ జలాల్లో స్నానం చేయడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమై మానసిక ఆహ్లాదం నెలకొంటుంది. అందుకే చలి కాలంలోనే చాలా పండుగలు వస్తాయి.
నదులు, సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం:
కార్తీక మాసంలో ముఖ్యంగా కాలువ, నది, సముద్రాల్లో స్నానం చేయడం మంచిదని అంటారు. ఎందుకంటే కార్తీక మాసం వచ్చే సరికి.. వర్షాకాలం పూర్తి అయిపోయి.. నదుల ఉధృతి తగ్గి.. మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మాలమైన నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలో స్నానం చేస్తే చాలా ఆరోగ్యం. అందుకే నదుల్లో, సముద్రాల్లో, కాలువల్లో స్నానాలు చేయాలని పూర్వం పెద్దలు చెబుతూండేవారు.
అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి:
అలాగే కార్తీక మాసంలో పెట్టే దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో నువ్వుల నూనె, నెయ్యితో పెట్టిన దీపం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాదు చలికి ఆ దీపం వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇలా కార్తీక మాసంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.