Kamakhya Temple: సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. ఏడాదిలో మూడు రోజులు ఈ అమ్మవారి ఆలయ తలుపులు మూసివేత.. ఎందుకంటే

దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య ఆలయం. అస్సాం గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. తాంత్రిక ఆరాధకులకు మాత్రమే కాదు భక్తి శ్రద్దలతో కొలిచే భక్తులు కోరే కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని అమ్మవారు కామాఖ్యా దేవిగా.. త్రిపుర శక్తిదాయినిగా భక్తులతో పూజలను అందుకుంటుంది. మూడు ప్రధాన రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం ఎన్నో వింతలకు విశేషాలతో ప్రసిద్ది చెందింది. అయితే ఈ కామాఖ్య దేవి ఆలయ తలుపులు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 రోజులు మూసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..

Kamakhya Temple: సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. ఏడాదిలో మూడు రోజులు ఈ అమ్మవారి ఆలయ తలుపులు మూసివేత.. ఎందుకంటే
Kamakhya Devi Temple

Updated on: Mar 03, 2025 | 1:46 PM

భారతదేశం దేవాలయాలకు నిలయం. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు వేటికి అవే సొంత చరిత్ర ఉంది. అనేక దేవాలయాలు పురాతనమైనవి. ఇవి అద్భుతాలు, రహస్యాలతో నిండి ఉన్నాయి. ఈ దేవాలయాల వైభవం చాలా ప్రత్యేకమైనది. అయితే అనేక ఆలయాల్లోని రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ చేధించలేకపోయారు. అలాంటి ఒక మర్మమైన ఆలయం అస్సాంలోని గౌహతిలో ఉంది. ఈ ఆలయాన్ని ప్రజలు కామాఖ్య దేవి పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటి.

పురాణ నమ్మకాల ప్రకారం..

కామాఖ్య దేవి ఆలయంపై ప్రజలకు గొప్ప నమ్మకం ఉంది. నమ్మకాల ప్రకారం ఈ ఆలయంలోని ప్రధాన దైవం కామాఖ్య దేవిని ఒకసారి దర్శించుకుంటే.. వ్యక్తి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆలయం అఘోరీలకు, తాంత్రికులకు బలమైన కోట. అఘోరీలు, తాంత్రికులు తమ సాధన కోసం దూర ప్రాంతాల ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిని నేటికీ శాస్త్రజ్ఞులు చేధించలేకపోయారు. ఆ రహస్యాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

ఎర్రగా మారే బ్రహ్మపుత్ర నది నీరు

అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు ఏడాదిలో మూడు రోజులు ఎర్రగా మారుతుంది. కామాఖ్య దేవికి మూడు రోజులు రుతుక్రమం అవుతుందని మతపరమైన నమ్మకం ఉంది. ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు పూర్తిగా ఎర్రగా మారుతుంది. ఈ సమయంలో ఆలయ తలుపులు కూడా మూసివేస్తారు. ఈ సమయంలో ఆలయంలోకి ఎవరినీ అనుమతించరు. ఈ మూడు రోజుల తర్వాత భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. కామాఖ్య మాత ఆలయంలో భక్తులకు ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. అమ్మవారు బహిష్టు సమయంలో ఆస్థానంలో తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు. మూడు రోజుల తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు.. ఈ వస్త్రం ఎర్రగా మారిపోతుంది. ఈ వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

ఇవి కూడా చదవండి

అమ్మవారి విగ్రహం లేని ఆలయం

కామాఖ్య దేవి ఆలయంలో మాతృ దేవత విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక దైవిక చెరువు ఉంది. ఈ చెరువు ఎప్పుడూ పూలతో కప్పబడి ఉంటుంది. హిందూ విశ్వాసాల ప్రకారం.. అమ్మ వారి ప్రధానమైన యోని భాగం నీలాచలంపై పడిందని.. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కనుక ఈ శక్తి పీఠం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాదు ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించే వ్యక్తి అన్ని ప్రాపంచిక ప్రలోభాల నుంచి విముక్తి పొందుతాడని కూడా నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు