
కైలాస మానస సరోవర యాత్ర.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. జీవన్ముక్తి యాత్ర. జీవన సాఫల్యయాత్ర. అదో ఆధ్యాత్మిక ప్రయాణమే అయినా.. అంతుచిక్కని రహస్యం దాగుందేమో అనిపిస్తుంది ఆ ప్రయాణంలో. వైజ్ఞానిక ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచే ఓ మార్మిక గ్రంథాలయం..! కైలాస, మానస సరోవరం. పరమపావణమైన ఆ ప్రదేశం భూమికి, స్వర్గానికి వారధి అని హిందువుల నమ్మకం. ఈ అనంత విశ్వానికే కేంద్రకం ఆ కైలాస పర్వతం అని జైనుల నమ్మకం. కాదూ.. ఈ విశ్వాన్ని నడిపించే నావ లాంటిది అని బౌద్ధుల విశ్వాసం. అసలు కైలాస మానస సరోవరాలను చూడ్డం కాదు.. వాటి గురించి చదవడమూ అంత తేలికైన విషయం కాదంటారు జగ్గీ వాసుదేవ్ లాంటి వారు. మానస సరోవర యాత్రకు అనుమతి ఎంత చదువుకున్నా, ఎంత తెలివివంతుడవైనా.. ఆ మార్మికమైన ప్రపంచంలోకి అడుగుపెడితే.. అంతా అయోమయంగా అనిపించి, మళ్లీ అఆల అభ్యాసాన్ని మొదలు పెట్టాలేమో అనిపించే ఓ భావన కలుగుతుందని చెబుతుంటారు. అలాంటి కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్లుగా నిలిచిపోయింది. కారణం.. కరోనా అని చెప్పాల్సి వచ్చినా చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఒకటి. 2020లో చివరిసారిగా కైలాస పరిక్రమణ, మానస సరోవర యాత్రకు అనుమతి ఇచ్చింది చైనా. మళ్లీ ఇన్నాళ్లకు.. చైనాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చల ఫలితంగా.. యాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అన్నీ అనుకూలిస్తే.. వచ్చే మే, జూన్ నెల...