Khairatabad Ganesh: ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్ గణనాథుడి భారీ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయగా, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏడాది ప్రభుత్వం చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నగరంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చాలా బాధాకరం. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడటం దారుణం. ఎవరి దేవుళ్లను వారు నమస్కరిస్తారు, కానీ రెండు వర్గాల్లో ఘర్షణ పెట్టేలా మాట్లాడే మాటలు సరికాదు. శాంతిభద్రతలు పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. పాతబస్తీ, కొత్త నగరంలో అందరూ కలిసిమెలిసి ఉండే పట్టణం మనది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ సారి ఖైరతాబాద్ గణేషుడిని 50 అడుగుల మట్టితో తయారు చేయడం విశేషం. గణనాథునికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి..ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీ దేవి దర్శనమివ్వనున్నారు. ఎప్పుడూ ప్రతిష్టించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహం కంటే ధృడంగా మహా గణపతిని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఇదివరకే తెలిపింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..