Statue of Equality: హైదరాబాద్ నగరంలోని ముచ్చింతల్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీరామనగరంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈనెల 2 న ప్రారంభమైన సహస్రాబ్ది ఉత్సవాలు 13 రోజుల పాటు అంగరంగవైభవంగా జరిగాయి. రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. సమతామూర్తిని లోకార్పణం చేశారు. ఈనెల 13న భగవద్రామానుజాచార్యుల 120 కిలోల సువర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణ చేశారు. చివరి రోజు సోమవారం శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించు పులకరించారు.
ఇక మహా క్రతువుకు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆధ్యాత్మిక నగరి, శ్రీరామనగరాన్ని దర్శించుకొని పుణీతులయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సమతామూర్తి విగ్రహంతో పాటు 108 దివ్యక్షేత్రాల్లో ఉన్న భగవన్ మూర్తులను దర్శించుకోవడానికి తాజాగా వీలు కల్పించారు. భక్తులు నామమాత్రపు ఎంట్రీ ఫీజుతో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 06:30 గంటల వరకు దర్శించుకునే వెసులుబాటు కల్పించారు.
అయితే ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామానుజ మూర్తి బంగారు విగ్రహంతో పాటు, భారీ విగ్రహానికి సంబంధించిన 3డీ మ్యాపింగ్ లేజర్ షో అందుబాటులో ఉండదని నిర్వాహకులు తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని రకాల సేవలను పునరుద్ధరించి భక్తులకు తెలియజేస్తామని వివరించారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. సందేహాల నివృత్తి కోసం 790 142 2022 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.