హిందూమతంలో వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇరువురు వ్యక్తులను కలిపే పవిత్రమైన బంధం వివాహం. పెళ్లి కుదిరినది మొదలు.. వధూవరుల ఇంట్లో పెళ్లికి సన్నాహాలు మొదలవుతాయి. అబ్బాయి, అమ్మాయి జాతకం సరిపోయిందని నిశ్చయించుకుంది మొదలు.. వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పండితుల సలహా కూడా తీసుకుంటారు. వివాహం తర్వాత మహిళలు తమ కాలి వేళ్లకు మెట్టెలు ధరిస్తారని హిందూ మతంలోని దాదాపు అందరికీ తెలుసు. అయితే ఇలా మెట్టెలు ధరించడం వెనుక కారణం ఏంటో తెలుసా?
మెట్టెలు ధరించడం హిందూ సంప్రదాయం వివాహ వేడుకలో ఒక భాగం అయినప్పటికీ ఇప్పుడు అది ఫ్యాషన్‌గా మారింది. మహిళకు పెళ్లి అయింది అనడానికి ఒక సంకేతం కాలి మెట్టెలు. పెళ్లి అయిన స్త్రీ అలంకరణలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. వివాహానంతరం.. వధూవరుల సంతోషకరమైన వైవాహిక జీవితానికి సంకేతం మెట్టెలు గా భావిస్తారు.
జ్యోతిష్యం ఏం చెబుతోంది?
భార్య భర్తకు మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే రెండు పాదాలకు రెండు లేదా మూడు వేళ్లకు మెట్టెలను ధరించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మెట్టెలు ధరించిన స్త్రీని చూసి లక్ష్మీదేవి సంతోషిస్తుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులు శాశ్వతంగా ఉండడం కోసం వెండి మెట్టెలను ధరించడం చాలా ముఖ్యం. ఇలా స్త్రీ మెట్టెలు ధరించే సాంప్రదాయం రామాయణంతో ముడిపడి ఉంది. రావణుడు సీతను అపహరించినప్పుడు, ఆమె తన వస్తువులను దారిలో విసిరేసింది. రాముడు సులువుగా తన జాడను కనిపెడతాడని ఇలా చేసింది. అప్పుడు లక్ష్మణుడు తన వదిన సీతాదేవి కాలి మెట్టెలను చూసి గుర్తుపట్టాడని పురాణాల కథనం.
వెండి మెట్టెలు ఎందుకంటే?
స్త్రీలు మెట్టెలను మధ్య వేలుకు ధరించాలి. ఈ వేలు నేరుగా గుండెకు సంబంధించినది. ఈ వేలికి వెండి మెట్టెలు ధరించడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు. భార్యాభర్తల జీవితంలో శాంతి నెలకొంటుంది. అలాగే, వెండి శరీరానికి ఉత్తమమైన లోహంగా పరిగణించబడుతుంది. ఈ లోహం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).