శ్రీశైలం మల్లిఖార్జునుడంటే భక్తుల్లో అపార భక్తివిశ్వాసాలు. మల్లన్న ముంగిట తలనీలాల సమర్పణ చేయాలన్న ఆలోచనతో శ్రీశైలం వస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఇక్కడి వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. ఇంకా కొన్ని కార్యకలాపాలు ఊపందుకోనే లేదు. అందులో భాగంగా కళ్యాణ కట్ట తెరుచుకోనే లేదు. అందువల్ల స్వామివారికి మొక్కులు చెల్లించే భక్తులకు గుండు కష్టాలు మొదలయ్యాయి. కరోనా సెకెండ్ లాక్ వేవ్ కారణంగా.. ఇక్కడి కార్యక్రమాలు బాగా దెబ్బ తిన్నాయి. అందులో భాగంగా కళ్యాణ కట్ట తిరిగి తెరుచుకోలేదు.. దీంతో స్వామివారికి తలనీలాలు ఇచ్చేందుకు వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొక్కు చెల్లించుకోడానికి వచ్చి ఆ పని చేయకుండానే వెనుదిరగటమా? అసలే మల్లన్నతో వ్యవహారం. కాబట్టి ఎలాగైనా సరే గుండు కొట్టించుకునే వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారు స్వామివారి భక్తులు. బంధుమిత్రులతో వచ్చిన వారికి కొంత వెసలుబాటు ఉంటోంది. అదేంటంటే.. ఒకరి గుండు మరొకరు గీక్కుంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని ఈ వింత దృశ్యాలు ఇక్కడికొచ్చిన వారి కంట పడుతున్నాయి. సెకెండ్ లాక్ డౌన్ ఎత్తేసి చాలా కాలమే అయ్యింది. ఇంకా కళ్యాణ కట్ట తెరవకుంటే ఎలా? అన్నది భక్తుల ప్రశ్నగా తెలుస్తోంది… ఏమో ఏ మూడో ముప్పు ముంచుకొస్తుందో.. తెలీదు. కాబట్టి.. అన్ని కార్యక్రమాలను పునరుద్దరించాలా? వద్దా? ఆలోచిస్తున్నాం అంటున్నారు ఆలయ అధికారులు. అంతా బాగుంటే త్వరలోనే తెరుచుకుంటుందని భక్తులు, ఆలయ అధికారుల భావిస్తున్నారు.