హిందూ మతంలో గురు పూర్ణిమ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని హిందువుల నమ్మకం. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. గురు పౌర్ణమి రోజున చేసే పూజలు, దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ జూలై 20, శనివారం సాయంత్రం 05:59 గంటలకు ప్రారంభమై జూలై 21 ఆదివారం సాయంత్రం 03:46 గంటలకు ముగుస్తుంది. పెరుగుతున్న చంద్రుడుని దృష్టిలో ఉంచుకుని గురు పౌర్ణమి పండుగను జూలై 21 న జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున అనేక అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాది గురు పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది.
ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగను ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఏడాది పౌర్ణమి రోజున ఉదయం 05.37 గంటలకు సర్వార్థ సిద్ధి యోగం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ యోగం అర్ధరాత్రి 12:14 గంటలకు ముగుస్తుంది. దీనితో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 12.14 వరకు ఉంటుంది. దీంతో పాటు శ్రవణ నక్షత్రం, ప్రీతి యోగం కూడా ఏర్పడుతోంది. అంతే కాకుండా ఉదయం నుంచి రాత్రి 09.11 గంటల వరకు విష్కంభ యోగం ఉండనుంది.
గురు పౌర్ణమి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని సూచిస్తుందని ఒక మత విశ్వాసం. నేటి కాలంలో విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలు, జీవన నైపుణ్యాలను పరిచయం చేస్తారు. ఇవి స్టూడెంట్స్ పెరిగేకొద్దీ బయట ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియజేస్తుంది.
బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఈ రోజున తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ఐదు వారాల తర్వాత బుద్ధుడు బుద్ధగయ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌కు మారాడు. అక్కడ పౌర్ణమి రోజున తన భోధనలను ప్రజలకు వినిపించాడు. అందుకే గౌతమ బుద్ధుని అనుచరులు ఆయనను ఆరాధించడానికి ఈ రోజును గురు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు. బౌద్ధులకు ఆషాఢ పౌర్ణమి తిధి ముఖ్యమైనది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు