Goda Devi Garland: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తమిళనాడు నుండి తిరుమలకు చేరుకున్న గోదాదేవి మాలలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు ఆదివారం
Goda Devi Garland – Srivari Brahmotsavams: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడినుంచి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఛైర్మన్ రవిచంద్రన్ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
శ్రీ విల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.