ఎవరైనా ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రమే కాదు.. ఆలయానికి వెళ్లే సమయంలో కూడా దేవుడికి నైవేద్యంగా పండ్లు, పూలు, దండలు, మిఠాయిలు మొదలైన వాటిని కొంటారు. భక్తి శ్రద్దలతో వాటిని దేవుడికి సమర్పిస్తారు. ఇలా చేయడం వలన తాము కోరిన కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం. అంతేకాదు కొందరు దేవాలయాల్లో వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా పెడతారు. తిరుపతి లడ్డు, అయ్యప్ప స్వామి ప్రసాదం అరవణ, అన్నవరం ప్రసాదం ఇలా రకరకాల ప్రసాదాల గురించి తెలిసిందే. అక్కడ ప్రసాదాన్ని ఇష్టంగా కొని తెచ్చుకుంటారు కూడా.. అయితే మన దేశంలోని ఓ దేవాలయంలో లడ్డూలు లేదా ఇతర నైవేద్యాలు కాకుండా గడియారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో దైవానికి ప్రసాదంగా వాచీని, గడియారాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రమాదాలు, అశుభాలు జరగవని చెబుతారు. ఈ రోజు ఆ ఆలయం గురించి తెలుసుకుందాం..
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని బ్రహ్మబాబా అని కూడా అంటారు. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు పూలమాలలు సమర్పించే బదులు ఆలయంలో గడియారాలను సమర్పిస్తారు. ఈ ఆలయంలో దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ వింత నైవేద్యాల కారణంగా ఈ ఆలయం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. బ్రహ్మ బాబా ఆలయం ప్రత్యేకత.. దీని వెనుక ఉన్న సంప్రదాయం ఏమిటంటే..
స్థానికుల కథనం ప్రకారం ఒకసారి ఒక వ్యక్తి మంచి డ్రైవర్ కావాలనే కోరికతో బ్రహ్మబాబా ఆలయానికి వచ్చాడు. బాబా గుడిలో కోరిక నెరవేరి మంచి డ్రైవర్‌గా మారాడు. సంతోషంతో ఆ వ్యక్తి ఈ ఆలయంలో గడియారాన్ని సమర్పించాడు. అలా ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ఆనోటా ఈ నోటా ప్రజలకు తెలియడంతో.. ప్రజలు ఆలయంలో గడియారాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ ఘడి బాబా దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందంటే.. ఎవరైనా తమ కోరిక నెరవేరిన తరువాత.. భక్తులు నైవేధ్యంగా గడియారాలను సమర్పించడానికి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం వెలుపల ఒక మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టుకి మొక్కులు చెల్లిస్తూ గడియారాలను కడతారు. ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయంలో నైవేద్యంగా సమర్పించే వాచీలను ఎవరూ దొంగిలించలేరు. ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తూనే ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు