
ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. చనిపోయినవారు పుట్టక తప్పదు. ఇదంతా నిరంతరాయంగా జరుగుతుంది. ఈ విషయాన్ని భగవద్గీత స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హిందూ గ్రంథాలలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పురాణంలో శ్రీ మహా విష్ణువు.. గరుడ దేవుడికి.. మరణం, మరణాంతరం జీవితం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. మరణించిన వ్యక్తి వస్తువులను ముఖ్యంగా దుస్తులను తిరిగి ఉపయోగించాలా? లేదా అనేది. సాధారణంగా మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను దుస్తువులను చాలా మంది వదిలేస్తారు. అవసరం ఉన్నవి తప్ప, మిగిలిన వాటిని అస్సలు ఉపయోగించరు. ఇందుకు కారణం తెలియకపోయినప్పటికీ చాలా మంది చనిపోయినవారి దుస్తులను ధరించరు. అయితే, ఇప్పుడు గరుడ పురాణంలో దీని గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం.
మరణించిన వ్యక్తికి చెందిన ఏ వస్తువులను ఉపయోగించకూడదు? ఉపయోగిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటయో అనే దాని గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. గరుడ పురాణం.. పొరపాటున కూడా మరణించిన వ్యక్తి దుస్తులు ధరించకూడదని చెప్పింది. ఒక వ్యక్తికి అతని దుస్తులపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి ఆత్మ భౌతిక ప్రపంచం పట్ల అనుబంధంతో కట్టుబడి ఉంటుంది. అది తన ప్రియమైన వారి మధ్య ఉండాలని, దాని వస్తువులతో అనుసంధానించబడి ఉండాలని కోరుకుంటుంది. అలాంటి పరిస్థితిలో ఎవరైనా మరణించిన వ్యక్తి దుస్తులను ధరించినప్పడు.. ఆత్మ దానిని ఇష్టపడకపోవచ్చు. అది ఆ వ్యక్తిపై చెడు ప్రభవాన్ని చూపే అవకాశం ఉంది. అందుకే మరణించిన వ్యక్తి దుస్తులను ఉపయోగించకుండా ఉండాలి. లేదంటే దానం చేయాలి.
గరుడ పురాణం ప్రకారం.. మరణించిన వ్యక్తి దుస్తులను ఉపయోగించడం వల్ల ఆత్మ ఆకర్షితమవుతుంది. ఈ దుస్తులను ధరించిన తర్వాత మరణించిన వ్యక్తి యొక్క శక్తి వాటిలోకి శోషించడం ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే అది బట్టలైనా.. చేతి గడియారం లేదా మరణించిన వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఇతర వస్తువులు ఉంటే వాటిని తిరిగి ఉపయోగించవద్దు. వాటిని దానం చేయండి అని గరుడ పురాణం చెబుతోంది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)