సృష్టిలో స్నేహానికి మించిన తీయటి బంధం మరొకటి లేదంటారు. అటువంటి చక్కని బంధానికి సంబంధించి జ్యోతిష శాస్త్రపరంగా ఎటువంటి యోగాలు ఉన్నదీ పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో స్నేహ సంబంధాలకు గురుగ్రహం కారకురాలు. జాతక చక్రంలో గురుగ్రహంతోపాటు 11 వ స్థానం కూడా స్నేహ సంబంధాలను సూచిస్తుంది. గురువు, 11వ స్థానం, 11వ స్థానం అధిపతి స్థితిగతులను బట్టి స్నేహ సంబంధాల గురించి చెప్పవలసి ఉంటుంది.
సాధారణంగా 11వ స్థానంలో శుభగ్రహాలు ఉన్న పక్షంలో మంచి స్నేహాలు ఉంటాయని, పాపగ్రహాలు ఉన్న పక్షంలో చెడు స్నేహాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ స్థానంలో బలమైన గ్రహం ఉన్న పక్షంలో స్నేహం కోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు. పాప గ్రహాలు లేదా నీచ గ్రహాలు ఉన్నట్టయితే, అవసరాల కోసం, స్వార్థం కోసం వాడుకునే మిత్రులు ఉంటారు.
గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రవి వంటి శుభ గ్రహాలు గనక 11వ స్థానంలో అంటే లాభ స్థానంలో ఉన్నట్టయితే, చక్కటి స్నేహితులు, నమ్మకస్తులైన స్నేహితులు, విధేయులైన స్నేహితులు, పలుకుబడి గల స్నేహితులు, సంపన్న స్నేహితులు ఉంటారు. ఇందులో శుక్రుడు, చంద్రుడు స్త్రీ గ్రహాలు. ఇవి 11వ స్థానంలో ఉంటే మహిళా స్నేహితులు ఎక్కువగా ఉంటారు. మహిళలకు 11వ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నట్టయితే పురుష స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. పాప గ్రహాలైన శని, కుజుడు, రాహువు, కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నట్లయితే వ్యసనపరులు, స్వార్ధపరులు, జూదగాళ్లు, నేరస్తులు, మోసగాళ్లు తదితరులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి.
ఈ ఏడాది గురు శుక్రులు బలంగా ఉండబోతున్నందువల్ల స్నేహ సంబంధాలు పటిష్టం అవుతాయి. సాధారణంగా, వ్యక్తిగత జాతక చక్రంలో గురువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు విద్యావంతులు, మేధావులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, పలుకుబడి గలవారు, సంపన్నులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. గురువు అక్కడ ఉన్నందువల్ల స్నేహాలు నిస్వార్ధంగా కూడా కొనసాగుతాయి. వీరి స్నేహబంధం శాశ్వతంగా సాగిపోతుంది. ఇదే రాశిలో శుక్ర గ్రహం ఉన్నట్టయితే ఆడ స్నేహితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు, సంపన్నులతో గాఢమైన పరిచయాలు, స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ 11వ స్థానంలో రవిగ్రహం ఉన్నట్టయితే మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది. 11వ స్థానంలో రవి ఉన్నట్టయితే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా కొట్టుకుపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో రవిగ్రహం ఉన్నవారికి విధేయులైన లేదా నమ్మకస్తులైన స్నేహితులు ఉంటారు. వీరి స్నేహితులు వీరిని తమతోపాటే ఉన్నత స్థితికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇదే రాశిలో చంద్రగ్రహం ఉన్నట్టయితే ఎక్కువగా మహిళలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇటువంటి వారికి అన్ని రకాల వారితోనూ స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఎటువంటి వారితో నైనా స్నేహం చేయడం వీరికి అలవాటు. వీరికి స్నేహం విషయంలో తారతమ్యం ఉండదు.
ఇక ఏకాదశ స్థానంలో బుధ గ్రహం ఉన్నట్టయితే ఎక్కువగా విద్యావంతులు, మేధావులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, రచయితలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. వీరు ఎవరితోనైనా స్నేహం ఏర్పడితే దాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. స్నేహితుడు చేసే తప్పులను కూడా కప్పిపుచ్చుతుంటారు. స్నేహం విషయంలో మొదటగా ఆచితూచి అడుగు వేస్తారు. ఆ తరువాత అదే విడదీయరాని బంధంగా మారుతుంది. ఏకాదశ స్థానంలో శని ఉన్నవారు సాధారణంగా స్నేహాల విషయంలో తప్పటడుగులు వేస్తూనే ఉంటారు. ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మకూడదు అనే తేడా ఉండదు. సాధారణంగా స్నేహితులు వీరిని స్వార్థం కోసం వాడుకోవటం జరుగుతుంది. అయినప్పటికీ వీరు స్నేహితులను గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు.
కుజుడు ఏకాదశంలో ఉన్నవారు తమకంటే బలవంతులు, అవసరమైతే తమను కాపాడేవారు, ప్రశ్నార్ధకమైన శీలం, నడవడి కలవారితో స్నేహం చేస్తుంటారు. వ్యసనపరులు, తాగుబోతులు వీరి స్నేహితుల్లో ఉంటారు. ఈ స్నేహితులు వీరిని తప్పుదోవ పట్టిస్తుంటారు. మోసం, నమ్మకద్రోహం వంటివి వీరి జీవితాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక 11వ స్థానంలో రాహు కేతువులు ఉన్నట్లయితే ఎక్కువగా దుర్మార్గులతోనే స్నేహం చేయడం జరుగుతుంది. స్నేహితుల్లో చాలామంది అవినీతిపరులు, నేరస్తులు, మోసగాళ్లు అయి ఉంటారు. అరచేతిలో వైకుంఠం చూపించి దోచేస్తూ ఉంటారు.
కొత్త సంవత్సరంలో స్నేహాలకు సంబంధించినంత వరకు మేషం, మిధునం, సింహం, వృశ్చికం, మకర రాశి వారు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరికి గురు శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం. మిత్రుల కారణంగా ఉద్యోగాలలో చేరటం, వ్యాపారాలు ప్రారంభించడం, వృత్తులలో నిలదొక్కుకోవడం, ప్రతిభలు రాణించడం, విదేశాలకు వెళ్లడం, రుణ సమస్యలు తగ్గటం, మొండి బాకీలు వసూలు కావడం, ముఖ్యమైన పనులు పూర్తి కావడం, పెళ్లి సంబంధాలు కుదరటం వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి.