పవిత్రపుణ్యక్షేత్రం రామతీర్థం(Ramatheertham Temple) మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. నీలాచలం కొండపై కోదండ రాముడి ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు దేవదాయ శాఖ అధికారులు. దాదాపు ఏడాదిన్నర కిందట విజయనగరం జిల్లా ఒక్కసారిగా అట్టుడికి పోయింది. నీలాచలం కొండ పై ఉన్న పురాతన ఆలయంలోని, కోదండరాముని విగ్రహాన్ని దుండగలు ధ్వంసం చేశారు. ఈ వార్తతో రామభక్తులు, హిందువులు పెద్దఎత్తున నీలాచలం కొండ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఓవైపు బీజేపి, మరోవైపు టిడిపి నాయకులు తరలివచ్చి నిరసనలు తెలిపారు. నిందితులను పట్టుకొని నూతన విగ్రహాలను ప్రతిష్టించాలని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
అప్పటి పరిస్థితులపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై చర్యలకు దిగింది. ముందుగా విగ్రహ ప్రతిష్ఠ, కొండపై ఆలయ నిర్మాణంపై దృష్టి సారించింది. వెంటనే ఆలయ పునర్నిణానికి మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. కొండపై నుంచి సీతారాముల విగ్రహాలను కిందికి తెచ్చి కళాపకర్షణ చేశారు. ఆ తర్వాత టిటిడి స్థపతులతో తిరుపతిలో సుందరమైన స్వామివారి విగ్రహాలను తయారు చేయించారు. ఆ విగ్రహాలను రామతీర్థంలోని బాలాలయంలో ప్రతిష్ట చేసి పూజాకైంకర్యాలని జరుపుతున్నారు.
ఆ సమయంలో చినజీయర్ స్వామి పర్యటించి, కొండపై రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం చేయాలని అధికారులకు, మంత్రులకు సూచించారు. దీంతో గతేడాది డిసెంబరు 22న ఈ నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దీంతో కేవలం నాలుగు నెలల్లో పూర్తిగా రాతి శిలలతో కోవెల నిర్మించారు. ప్రధాన ద్వారంతో పాటు తలుపులు, గోడలపై సంప్రదాయ కళలు అందరిని కట్టిపడేస్తున్నాయి.
ఆలయ నిర్మాణం పూర్తికావటంతో, చైత్ర మాసంలో రేపు ఉదయం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపనున్నారు. ఇందుకోసం తిరుపతి వైదిక యూనివర్సిటీతో పాటు ద్వారకా తిరుమల నుంచి వచ్చిన ఋత్వికులు వైఖానస ఆగమం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల విగ్రహాలను ఆలయంలోకి చేర్చి, కళాపకర్షణ చేయనున్నారు. ఈ నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, రాజన్నదొర హాజరవుతారని అంటున్నారు అధికారులు.
అటు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకి ఇప్పటికే ఆలయ పండితులు, అధికారులు సంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. ఈ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయన స్పందించారు. గతంలో పలుమార్లు సంప్రదాయాలను ఉల్లంఘించారని, తనకు ఎవరు గౌరవమిచ్చినా, ఇవ్వకపోయినా దేవుడిని ప్రార్ధిస్తానని చెప్పారు. అయితే, అశోక్ గజపతి ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అటు అంగరంగ వైభవంగా స్వామివారి ఆలయ ప్రారంభోత్సవం, మరోవైపు సంప్రదాయాల అంశాలు ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారాయనే టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..
Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..