Tirumala: శ్రీవారి వాహన సేవల్లో భక్తులను కనువిందు చేసే గజరాజులు పేర్లు తెలుసా..

|

Sep 25, 2022 | 1:03 PM

తిరుమల శ్రీవారి సేవలకు ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే సేవలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే ఈసేవల్లో గజరాజులు, అశ్వాలు, వృషభాలదే ముఖ్యపాత్ర. స్వామివారి వాహనసేవల్లో

Tirumala: శ్రీవారి వాహన సేవల్లో భక్తులను కనువిందు చేసే గజరాజులు పేర్లు తెలుసా..
Srivari Vahana Seva (file Photo)
Follow us on

Tirumala: తిరుమల శ్రీవారి సేవలకు ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే సేవలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే ఈసేవల్లో గజరాజులు, అశ్వాలు, వృషభాలదే ముఖ్యపాత్ర. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వాటిదే. భక్తులను ముందుగా కనువిందు చేసేవి కూడా ఇవే. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతాన్ని భక్తులకు ఇస్తాయి. స్వామి వారితో పాటు ఈ గజరాజులను కూడా పనిలో పనిగా మొక్కతాం. ఎందుకంటే శ్రీవారి వాహన సేవల్లో పాల్గొంటున్న జంతువులు కావడంతో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మరి వాహనసేవలో పాల్గొనే గజరాజులకు కొన్ని పేర్లు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో గజవాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. లక్ష్మీ, మహా లక్ష్మి, పద్మావతి, పద్మజ, అవనిజ, వైష్ణవి, శ్రీనిధి అనే ఏనుగుల బృందం వాహన సేవను నడిపే అవకాశాన్ని పొందాయి. స్వామి వారి సేవలో తరిస్తున్న శ్రీ‌నిధికి 14 ఏళ్ల వయసు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు వయసు ఉంది. వాహ‌న‌ సేవల కోసం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కేర‌ళ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు వీటికి శిక్షణ అందించారు. గజం ఐశ్వర్యానికి చిహ్నం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువులైన గుర్రాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గజాల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మి అన్నిటికంటే పెద్దది. హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరం అందుకే శ్రీవారి వాహన సేవలో ఆడ ఏనుగులనే ఉపయోగిస్తారు. తిరుమలలో ఉన్న ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవలలో, గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేస్తారు. ఈ జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.

ఆలయ మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్‌ దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు నుంచి వాటిని మచ్చిక చేసుకుని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తారు. ప్రతి 20 నిమిషాలకోసారి చెరుకుగడలు, నేపియర్‌ గ్రాసం గజరాజులకు అందిస్తారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం, గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. ఏనుగుల సంరక్షణకు ఏడాదికి ఒక్కో ఏనుగుకు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అన్ని ఏనుగులకు ఆహారం అందించేందుకు టీటీడీ నెలకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూడండి..