ఈ రోజు ధన్వంతరికి ఎలా పూజ చేయాలి? షాపింగ్‌కు అనుకూలమైన సమయం ఏది? పూర్తి వివరాలు మీ కోసం

|

Oct 29, 2024 | 6:41 AM

ధన త్రయోదశి రోజున, లక్ష్మీ దేవిని, కుబేరుడు, ధన్వంతరిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఆయుర్వేద దేవుడు ధన్వంతరి సముద్రం మథనం నుండి అమృత పాత్రతో దర్శనమిచ్చాడని, అందుకే ఈ రోజు పాత్రలను కొనుగోలు చేసే ప్రత్యేక సంప్రదాయం ఉందని చెబుతారు. ధన త్రయోదశి పండుగను ఈరోజు అంటే అక్టోబర్ 29న జరుపుకుంటారు. ఈ రోజు ధన త్రయోదశి పండుగకు సంబంధించిన పూజ విధానం, వస్తువులు కొనుగోలు చేయడానికి శుభ సమయం, దీప దానం విశిష్టత గురించి తెలుసుకుందాం..

ఈ రోజు ధన్వంతరికి ఎలా పూజ చేయాలి? షాపింగ్‌కు అనుకూలమైన సమయం ఏది? పూర్తి వివరాలు మీ కోసం
Dhanteras 2024
Follow us on

భారతీయ సంస్కృతిలో ధన త్రయోదశి పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది దీపావళి 5-రోజుల పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున ధన్వంతరి, లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇంట్లో సంపద, శ్రేయస్సు రాకను సూచించే ధన త్రయోదశి శుభ సందర్భంగా ప్రజలు బంగారం, వెండి కొత్త పాత్రలను కొనుగోలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి ఈరోజు అంటే అక్టోబర్ 29న జరుపుకుంటున్నారు. ధన త్రయోదశి రోజున షాపింగ్ చేస్తారు. దీని తర్వాత లక్ష్మీ దేవి, ధన్వంతరి, కుబేరుడులను పూజిస్తారు.

మీరు కూడా ధన త్రయోదశి రోజున పూజలు చేయబోతున్నారా అయితే ధన త్రయోదశి రోజున పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడు? బంగారం, వెండి కొనడానికి ఎప్పుడు? లేదా కారు వంటి వస్తువులను కొనడానికి శుభముహూర్తం ఎప్పుడు తెలుసుకోవాలి.. ధన త్రయోదశి రోజున ఏమి కొనాలి, ఏది కొనకూడదు. అటువంటి పరిస్థితిలో ధన త్రయోదశికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం..

ధన త్రయోదశి రోజున ఏమి చేస్తారు?

ఇవి కూడా చదవండి

ధన త్రయోదశి రోజున ధన్వంతరితో పాటు, లక్ష్మీ దేవి, కుబేరులను పూజిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడమే కాదు ఈ రోజున దక్షిణ దిక్కున యమధర్మ రాజు పేరుతో దీపం వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి రోజున దక్షిణ దిశలో యమ దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల అకాల మరణం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.

ధన త్రయోదశి ఎందుకు జరుపుకుంటారు?
పురాణ గ్రంధాలలో వివరించిన కథల ప్రకారం సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవానుడు చేతిలో అమృతం కలశంతో ఉద్భవించాడు. ధన్వంతరి సముద్రం నుండి ఉద్భవించిన తిథి ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి. అందుకే ఈ తిధిని ధనత్రయోదశి అని కూడా అంటారు. ధన్వంతరి సముద్రం నుండి చేతిలో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ సందర్భంగా పాత్రలను కొనుగోలు చేసే సంప్రదాయం కొనసాగుతుంది. ధన్వంతరి భగవంతుని దర్శనానికి గుర్తుగా ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు.

ధన త్రయోదశి రోజున ఏమి కొనుగోలు చేయాలి?
ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, పాత్రలు, ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ప్రజలు ధన త్రయోదశి రోజున కొత్త పాత్రలను కొని వాటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ధన త్రయోదశి రోజున చీపురు, రాగి పాత్రలు, కొత్తిమీర, ధనియాలు, ఉప్పు కొనడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీటిని కొనడం వల్ల ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.

ధన త్రయోదశిలో ఏమి కొనకూడదు?
ధన త్రయోదశి రోజున గాజు పాత్రలు అస్సలు కొనకూడదు. గాజును రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు. కనుక ఈ రోజున గాజు పాత్రలను కొనకండి. అంతే కాకుండా ధన త్రయోదశి రోజున ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనకూడదు. జ్యోతిషశాస్త్రంలో అల్యూమినియం దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల ధన త్రయోదశి రోజున అల్యూమినియం కొనడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది. వీటన్నింటితో పాటు ధన త్రయోదశి రోజున పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువులు, విరిగిన వస్తువులను కొనకుండా ఉండాలి.

ధన త్రయోదశి రోజున ఎప్పుడు షాపింగ్ చేయాలి?
ధన త్రయోదశి రోజున కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం అక్టోబర్ 29 ఉదయం 6:31 నుండి ప్రారంభమవుతుంది. మర్నాడు అక్టోబర్ 30న ఉదయం 10:31 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో చేసే కొనుగోళ్లు మూడు రెట్లు పెరుగుతాయి. శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. ఈ కాలంలో మీరు ఏదైనా కొనుగోలు చేయవచ్చు.

ధన త్రయోదశి రోజున ఎప్పుడు షాపింగ్ చేయకూడదు?
ధన త్రయోదశి రోజున రాహుకాలం అక్టోబర్ 29వ తేదీ మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. ఈ కాలంలో పొరపాటున కొనుగోళ్లు చేయకూడదు. రాహుకాలంలో షాపింగ్ చేయడం శుభ ఫలితాలను ఇవ్వదు. దీనితో పాటు ఇది వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ధన త్రయోదశిలో బంగారం కొనడానికి మంచి సమయం ఏది?
ధన త్రయోదశి బంగారం కొనడానికి అక్టోబరు 29 ఉదయం 10:31 నుండి అక్టోబర్ 30 ఉదయం 6:32 వరకు, అంటే ఈసారి బంగారం కొనడానికి మీకు 20 గంటల 1 నిమిషం సమయం ఉంది. ఈ కాలంలో మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ధన త్రయోదశి బంగారం కొనడానికి ఉత్తమ సమయం అక్టోబర్ 29 సాయంత్రం 6:32 నుండి 08:14 వరకు.

ధన త్రయోదశి రోజున వాహనం కొనడానికి మంచి సమయం ఏది?
ధన త్రయోదశి రోజు మొత్తం షాపింగ్‌కు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే వాహనాలు లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం చాలా లాభదాయకంగా ఉండే కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయి. ధన త్రయోదశి రోజున వాహనం కొనడానికి 3 శుభ ముహూర్తాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం అక్టోబర్ 29 ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. తరువాత రెండవ శుభ ముహూర్తం అక్టోబర్ 29వ తేదీ మధ్యాహ్నం 12:05 నుండి 1:28 వరకు. దీని తరువాత వాహనం కొనడానికి మూడవ శుభ సమయం అక్టోబర్ 29 రాత్రి 7:15 నుండి 8:51 వరకు.

ధన త్రయోదశి పూజ చేయడానికి అనుకూలమైన సమయం ఎప్పుడు?
ధన త్రయోదశి పండుగ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున వస్తుంది. మీరు ధన త్రయోదశి పూజ చేయబోతున్నట్లయితే అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం 6:31 నుండి రాత్రి 8:13 గంటల వరకు ధన త్రయోదశి రోజున పూజించడానికి అనుకూలమైన సమయం ఉంటుంది. ఈ సమయంలో మీరు పూజలు చేయవచ్చు.

ధన త్రయోదశిలో దీపాలను ఎప్పుడు దానం చేయాలి?
ధన త్రయోదశి రోజు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో యమ ధర్మ రాజుకి దీపం దానం చేస్తారు. ఈసారి 29 అక్టోబర్ 2024న ప్రదోషకాలం సాయంత్రం 5:38 నుండి ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 6:55 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున దీపాలను దానం చేయడానికి 1 గంట 17 నిమిషాల పూర్తి సమయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు దీపాలను దానం చేయవచ్చు.

ధన త్రయోదశి పూజ సమగ్ర జాబితా
ధన త్రయోదశి పూజలో, గణేశుడు లక్ష్మీదేవి చిత్రం, గంగాజలం, 13 దీపాలు, పత్తి ప్యాకెట్, ఒక ప్లేట్, ఒక చెక్క పీటం, ఎరుపు లేదా పసుపు బట్టలు, నీరు, నెయ్యి, అగ్గిపుల్ల, చక్కెర లేదా బెల్లం, మౌల్వి , పసుపు, అక్షతం, కర్పూరం, అగరబత్తులు, ధూపం మొదలైనవి అవసరం.

ధన త్రయోదశి పూజ విధి

ధన త్రయోదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
పూజ ప్రారంభించే ముందు, ప్రధాన ద్వారం వద్ద రంగోలి వేసి ఇంట్లో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి.
దీని తరువాత లక్ష్మీ దేవిని, కుబేరుడు, ధన్వంతరిని షోడోపచార పద్ధతితో పూజించండి.
దేవతలకు కుంకుమ పూసి, పూలమాల వేసి అక్షతలు సమర్పించి అనంతరం నైవేద్యం సమర్పించండి
అనంతరం నైవేద్యంలో తులసి దళాలు, ఆవు పాలు, దానితో చేసిన వెన్నను ధన్వంతరికి సమర్పించండి.
ధన త్రయోదశిలో ఇత్తడితో చేసిన వస్తువును కొని ధన్వంతరికి సమర్పించండి.
అనంతరం ధన్వంతరి స్తోత్రాన్ని పఠించి చివరకు లక్ష్మీ దేవి, కుబేరు దేవత, ధన్వంతరికి హారతి ఇవ్వండి.
పూజ అనంతరం అందరికీ ప్రసాదం పంచి, సాయంత్రం పిండితో నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేయాలి.
నాలుగు ముఖాల దీపంలో ఆవాలు లేదా నువ్వుల నూనె వేసి ఇంటి వెలుపల దక్షిణం వైపు ఉంచాలి.

ధన త్రయోదశిలో దీపం ఎందుకు దానం చేస్తారు?

మృత్యు దేవుడైన యమ ధర్మరాజును ప్రసన్నం చేసుకోవడానికి ధన త్రయోదశి సాయంత్రం దీపాలను దానం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున దీపదానం చేయడం వల్ల అకాల మరణం నివారిస్తుందని మత విశ్వాసం. అలాగే కుటుంబ సభ్యులందరూ అకాల మరణ భయం నుంచి విముక్తి పొందుతారు. అందుకే ధన త్రయోదశి సాయంత్రం దీపాలను దానం చేస్తారు.

ధన త్రయోదశి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి?

ఈ రోజున ఇంట్లో 13 దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఇంట్లో 13 దీపాలు వెలిగిస్తే సంపదలు చేకూరుతాయని, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం. ఈ 13 దీపాలను ధన త్రయోదశిలో ఇంట్లో వేర్వేరు ప్రదేశాలలో ఉంచుతారు.

ధన త్రయోదశిలో ఏ రంగు దుస్తులు ధరించాలి?
ధన త్రయోదశి శుభ సందర్భంగా పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. దీన్ని ధరించడం వల్ల ధన్వంతరి భగవంతుడు ప్రసన్నుడై మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ధన త్రయోదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఎందుకంటే ఇది అశుభం.

ధన త్రయోదశిలో బంగారం, వెండి కాకుండా ఏమి కొనవచ్చు అంటే

మీరు ధన త్రయోదశి బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయలేకపోతే స్టీల్ లేదా రాగి పాత్రలు, చీపురు, ఉప్పు, ధనియాలు, లక్ష్మీ దేవి గణేష్ విగ్రహం, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. ధన త్రయోదశి నాడు ఈ వస్తువులను కొనడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)