మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యభగవానుడు(Surya dev) తన ఏడు గుర్రాల రథం, రథసారథి అరుణతో ప్రత్యక్షమై మొత్తం సృష్టిని ప్రకాశవంతం చేశాడు. అందుకే రథసప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఆ రోజున సూర్య భగవానుడిని నియమనిష్టలతో పూజిస్తారు. సూర్యదేవుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం, సుఖం, ఐశ్వర్యం, సంతానం, సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(Aras villi) క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరిస్తుంటారు. ఆ సమయం రానే వచ్చింది. 8వ తేదీన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ సూర్యదేవాలయం అరసవల్లిలో సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అరసవల్లి సూర్యభగవానుడికి తొలి పూజ చేయనున్నారు. విశాఖకు చెందిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ మొదటిగా క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పాలంకరణ సేవలు చేస్తారు. మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం కల్పిస్తారు. రాత్రి 11 గంటల నుంచి ఏకాంతసేవ జరుగుతుంది.
రథసప్తమి వేడుక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
ఇప్పటికే ఆలయంలో 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటితో పాటు డ్రోన్ కెమెరానూ వినియోగించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు, రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయించునున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాదాలు, దర్శనం టిక్కెట్లను ఏపీజీవీ, యూనియన్ బ్యాంకు సిబ్బంది విక్రయిస్తారు. మొత్తం 8 కౌంటర్లలో ద్వారా 70 వేల లడ్డూలు, 2 క్వింటాళ్ల పులిహోరను భక్తులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరసవల్లి కూడలి వరకు ఆర్టీసీ అధికారులు 20 బస్సులు నడపనున్నారు.
Also Read
Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ఘనంగా ఆరవరోజు కార్యక్రమాలు.. (లైవ్ వీడియో)