హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు లేక శరన్నవరాత్రులు అని అంటారు. ఈ దసరా ఉత్సవాన్ని నవరాత్రులుగా తొమ్మిది రోజులు పాటు జరుపుకుని.. 10వ రోజున దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి అవతారాలను అంటే నవ దుర్గలను అత్యంత భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. ఈ దేవీ నవరాత్రులలో చివరి మూడు రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటూ విద్యార్ధులు పుస్తకాలూ, పెన్నులను పూజిస్తే, శ్రామికులు తమ పనిముట్లను పూజిస్తారు. ఇక క్షత్రియులు ఆయుధ పూజ చేసి.. అమ్మవారి కృపకు పాత్రులవుతారు. దుర్గాదేవి మహిషాసురమర్దనిగా అవతరించి రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించింది. అంతేకాదు రాముడు రావణ సంహారం చేసింది దసరనే.. కనుక పూర్వం రాజులు తమ దండయాత్రకు దసరా పండగానే శుభ ముహార్తంగా ఎంచుకునే వారని తెలుస్తోంది.
ఇక దసరా రోజున లోహ పరికరాలను పూజించే సాంప్రదాయానికి కూడా దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని .. అందుకనే దసరా రోజున లోహపరికరాలని పూజించే ఆనవాయతీ వచ్చిందని చెబుతారు. దుర్గ అంటే దుర్గములను తొలగించేది అని అర్ధం. దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. పురాణాల ప్రకారం దుర్గ అంటే అర్ధం ఏమిటంటే దుర్ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది. కనుక దుర్గను ఆరాధించడం వలన దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రాక్షసుల బాధలు దరిచేరవు అని నమ్మకం. అందుకనే నవ రాత్రులు తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను.. తర్వాత మూడు రోజులు లక్ష్మి రూపాయలను ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి దేవి రూపాలను ఆరాధించి జ్ఞానాన్ని పొందుతారని పెద్దల నమ్మకం. ఈ తొమ్మిది రోజులు దుర్గసహస్రనామ పారాయణము అత్యంత ఫలవంతం. అంతేకాదు’దుం’ అనే బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ దుర్గాష్టమి సోమవారం రోజున వస్తే అత్యంత శ్రేష్టమైన రోజుగా భావిస్తారు.
దసరా మహర్నవమి:
ఈ దసరా నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనది తిది నవమి. ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కనుక ‘సిద్ధదా’ అని నవమికి పేరు. ఈ మహర్నవమి రోజున దేవి ఉపాసకులు అంతవరకు తాము చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తారు. ఇలా చేయడం వలన సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ మహర్నవమి రోజున క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులతో పాటు కులవృత్తులవారు తమ తమ ఆయుధాలను, పని ముట్లను పూజిస్తారు.
విజయదశమి: దసరా నవరాత్రులలో చివరి రోజు విజయ దశమిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ దశమికి శ్రవణా నక్షత్రంతో కలిస్తే విజయా అనే సంకేతం అని అర్ధం. అందుకనే దీనికి ‘విజయదశమి అనే పేరు వచ్చింది. ఇలా నవరాత్రులు భక్తీ శ్రద్దలతో అమ్మవారిని పూజించి అమ్మ దయకు పాత్రులవుతారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భావిస్తారు అమ్మవారు భక్తులు .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి