Chanakya Niti: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కష్టం, సుఖం, ఆనందం, సంతోషం, బాధ్యతలు, బంధాల కలయిక వివాహం బంధం. అందుకే పెళ్లి చేసుకునే ముందు తమ భాగస్వామి గురించి అన్నీ తెలుసుకోవాలి. లేదంటే.. అనేక బాధలు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లి గురించి ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంథంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు పేర్కొన్నారు. ప్రధానంగా పెళ్లి చేసుకునే ముందు.. ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలి? భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనేది స్పష్టంగా వివరించారు. ఇంట్లో అడుగుపెట్టబోయే భార్య గురించి నాలుగు కీలక అంశాలను ప్రస్తావించారు ఆచార్య చాణక్యుడు. ఈ నాలుగు లక్షణాలు గల స్త్రీ భాగస్వామిగా వస్తే.. జీవితం ఆనందమయం అవుతుందన్నారు. చాణక్య చెప్పిన ఆ నాలుగు లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..
అంతర్గత సౌందర్యం..
మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామిని కోరుకుంటే.. రూప సౌందర్యం కంటే.. గుణాన్ని చూడటం ఉత్తమం. అంతర్గత సౌందర్యంపై శ్రద్ధ వహించాలి. శారీరక ఆకర్షణ కొంతకాలం తర్వాత ఉండదు. కానీ అంతర్గత సౌందర్యం జీవితాంతం మీతోనే ఉంటుంది. అలాంటి జీవిత భాగస్వామి లభించడం మీకు మాత్రమే కాదు.. మొత్తం కుటుంబానికి మంచిది.
ఒత్తిడితో నిర్ణయం తీసుకోవద్దు..
కుటుంబ సభ్యుల బలవంతం మీద ఎప్పుడూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. ఏ జీవిత భాగస్వామి మీకు మంచిదని భావిస్తారో.. వారిని ఎంచుకోండి. బాగా అర్థం చేసుకోగల వ్యక్తులు.. మీ కష్టాల్లో వెన్నంటి ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోండి. ఒకరి ఒత్తిడితో పెళ్లి చేసుకుంటే.. తరువాత జరిగే పరిణామాలు మొత్తం జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేస్తాయి.
మతపరమైన అంశాల్లో వైఖరి..
ఆధ్యాత్మిక చింతన, మతపరమైన సంప్రదాయ పద్ధతులు ఏ వ్యక్తినైనా ఒక పరిమితిలో ఉంచుతాయని ఆచార్య పేర్కొన్నారు. ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు.. ఆచార సంప్రదాయాలకు విలువ ఇస్తారా? ఆధ్యాత్మిక చింతన ఉందా? అనేది చూడాలి. మతపరమైన ఆచార సంప్రదాయాలు వారిని మంచి జీవిత భాగస్వామిగా నిలుపుతాయి. వీరు మొత్తం కుటుంబాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుతారు.
సహనం..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే.. మీ జీవిత భాగస్వామిలో సహన గుణాన్ని ఖచ్చితంగా పరీక్షించాలని సూచించారు ఆచార్య. ఓపికగల వ్యక్తి కష్ట సమయాల్లో కుటుంబానికి సరైన మార్గాన్ని చూపుతారు. విపత్కర పరిస్థితుల్లో వారి సహకారం కారణంగా అన్ని సవాళ్లను సులభంగా పరిష్కరించగలుగుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..