
గొప్ప వ్యూహకర్త, దౌత్యవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. ఆయన విధానాలు శతాబ్దాల క్రితం ఎంత సందర్భోచితంగా ఉన్నాయో నేటికీ అంతే సందర్భోచితంగా ఉన్నాయి. చాణక్యుడు శత్రువును జయించాలంటే ఏ విధానాన్ని అనుసరించాలో పేర్కొన్నాడు. శత్రువిని కూడా మిత్రుడిగా మార్చి.. మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎవరూ తప్పుపట్టలేని మార్గాలను కూడా చాణక్యుడు చెప్పాడు. ఈ రోజు మనం శత్రువుపై విజయం సాధించేందుకు చాణక్యుడు చెప్పిన విధానాల గురించి తెలుసుకుందాం.. వాటిని పాటించడం ద్వారా మీ ప్రత్యర్థి కూడా మీ తెలివితేటలను అంగీకరించి మీ మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎవరైనా మీరు చెప్పిన మాటలను వినలన్నా మీ భావాలతో ఏకీభవించాలనుకున్నా.. ముందుగా వారిని అర్థం చేసుకోవడం ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు. శత్రువు లేదా ఎదుటివారి ఆలోచనలు, స్వభావం, బలహీనతలు, భావోద్వేగాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే శత్రువు కూడా ఆమోదయోగ్యమైనదిగా భావించే విషయాలను మీరు చెప్పగలరు.
ఎవరికీ నేరుగా ఆదేశాలు ఇవ్వకండి. మీరు ఎవరికైనా ఏమి చేయాలో నేరుగా చెబితే.. వారు నిరాకరించే అవకాశం ఉంది. బదులుగా అదే అంశంపై నెమ్మదిగా సంభాషణను ప్రారంభించి అతని/ఆమె అభిప్రాయాలను తెలుసుకోండి. అప్పుడు మీరు సంభాషణను సరైన దిశలో నడిపిస్తే.. అవతలి వ్యక్తి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆ నిర్ణయానికి స్వయంగా అర్ధం చేసుకుని చేసే ప్రయత్నం చేస్తాడు.
చాణక్యుడి ప్రకారం ఏ పనిలోనైనా చేయాలంటే ముందుగా సమయం చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. మీరు తొందరపడి మీ అభిప్రాయాన్ని చెప్పినా.. తొందర మాట్లాడినా అవతలి వ్యక్తి మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. అదే సమయంలో ఏదైనా పని చేయాలంటే నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కువ ఆలస్యం చేసినా అవకాశం కోల్పోవచ్చు. కనుక వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీ అభిప్రాయాన్ని అందరికీ తెలిసేలా వెల్లడించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.