Bhishma Niti: పంచమవేదంగా కీర్తిగాంచిన మహాభారతంలో ప్రతి పర్వం నేటి మానవునకు జీవిత గమనానికి మార్గనిర్ధేశాన్ని చేస్తాయి. ఈ మహాభారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. మహాభారతానికే వెన్నుముకగా నిలిచిన భీష్ముడు… అంపశయ్యపై ఉన్నప్పుడు రాజధర్మం గురించి హితబోధ. అంపశయ్యపై నున్న భీష్ముడు యుధిష్టిరునకు చేసిన ఉపదేశాలు నేటి మానవుడి జీవన విధానానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం..
1. నదీ ప్రవాహం ఒడ్డును కోసేస్తూ విస్తరించినట్టు శత్రువుని కూడా బలహీనపరచాలి. దెబ్బ తీయకూడదు, గాయం మానరాదు.
2. మృధువుగా మాట్లాడాలి. మృధువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి. మృధువుగా హెచ్చరించాలి. మృధుత్వాన్ని మించిన ఆయుధం లేదు.
3. ఉన్నంతలో నలుగురికీ పెట్టి తినేవాడు ఇహంలోనూ, పరంలోనూ గౌరవం పొందుతాడు.
4. సంపద, స్నేహ సంపద – ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారంటే స్నేహమే కావాలంటారు విజ్ఞులు.
5. జీవితం సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు. అరిషడ్వర్గాలే మొసళ్ళు. ధైర్యమే తెప్ప.
6. రాజ్యానికి మంచి జరిగినా, చెడు జరిగినా అందుకు పాలకుడిదే పూర్తి బాధ్యత.
7. అహింస, సత్యం,దయ ఇంద్రియ నిగ్రహం – వీటికి మించిన తపస్సు లేదు.
8. తీరని అప్పు, ఆరని నిప్పు ఎప్పుడూ ప్రమాదమే.
9. నాయకుడనేవాడు ముఖస్తుతికి లొంగకూడదు. పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని దూరంగా ఉంచాలి.