
భీష్మ పితామహ మహాభారతంలో గొప్ప యోధుడు. ఆయనను గంగపుత్ర భీష్ముడు అని కూడా పిలుస్తారు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. మహారాజు శంతనుడు, గంగా దేవి కుమారుడు. హస్తినాపురాన్ని మొత్తం రక్షించే బాధ్యత అతని భుజాలపై ఉంది. మహాభారత యుద్ధంలో కౌరువుల పక్షాన నిలిచి యుద్ధం చేశారు. ఇచ్చమరణం వరం పొందిన భీష్ముడు అర్జునుడు వేసిన బాణాలతో అంపశయ్య మీద ఉండి కురుక్షేత్ర యుద్ధాన్ని .. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని వీక్షించాడు. ఇలా అంపశయ్య మీద ఉన్న సమయంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి రాజ్యపాలన, మనిషిగా జీవించే విధానం వంటి అనేక విషయాలను చెప్పాడు. ధర్మ రాజుకి భీష్ముడు మహిళలను ఎలా చూడాలని అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాడు. అవి నేటికీ ప్రతి ఇంట్లో పాటించాల్సిన నియమాలు అని పెద్దల నమ్మకం. స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన విషయాలు ఏమిటంటే..
భీష్ముడు యుధిష్ఠిరుడికి స్త్రీను ఏ విధంగా చూడాలి.. ఏ విధంగా గౌరవించాలి అనే విషయం గురించి చెప్పాడు. ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. స్త్రీ సంతోషంగా లేని ఇల్లు, స్త్రీలకు గౌరవం ఇవ్వని ఇంట్లో పేదరికం రాజ్యమేలుతుంది. ఏ స్త్రీనైనా గాయపరిచినా లేదా కఠినమైన మాటలతో స్త్రీని ఇబ్బంది పెట్టి మానసికంగా బాధించినా ఆ ఇంట్లో దేవతలు నివసించరు.
తమ ఇంటి స్త్రీలను మాత్రమే కాదు.. సమాజంలో ప్రతి స్త్రీకి .. ప్రతిచోటా గౌరవం లభించాలి. స్త్రీ హక్కులను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. స్త్రీలను గౌరవించే ప్రదేశంలో ఆమె సాధికారత పొందుతుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా । ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువుంటారని అంటారు. కనుక పరాయి స్త్రీలను సైతం ఎంతో గౌరవంగా సోదర సమానంగా చూడాలి అని భీష్ముడు చెప్పాడు.
భీష్ముడి చెప్పిన ప్రకారం ఏ వ్యక్తి పొరపాటున కూడా స్త్రీలను వేదించకూడదు. స్త్రీని ఇబ్బంది పెట్టడం వలన ఏ స్త్రీ శాపానికి అయినా గురికావలసి రావచ్చు. స్త్రీలు పెట్టే శాపం నుంచి విముక్తి లభించదు. స్త్రీ శాపం తగిలేలా ఎన్నడూ ప్రవర్తించరాదు.
స్త్రీలను చేతలతో కానీ, మాటలతో కానీ కన్నీరు పెట్టించవద్దు. స్త్రీ దుఃఖం ఎల్లప్పుడూ విధ్వంసానికి కారణమవుతుంది. స్త్రీ కన్నీరు పెట్టిన ఇంట్లో సుఖ శాంతులు ఉండవు. స్త్రీలు, పిల్లలు, బాలికలు, ఆవులు, నిస్సహాయులను ఎప్పుడూ వేధించకూడదు. వారి శాపం విధ్వంసానికి దారితీస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు