
ఎగరరే ఏకైక క్షీరదాలు గబ్బిలాలు. కొంతమందికి ఇవి అంటే భయం. పగలు చెట్లపై తలక్రిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి. రాత్రి సమయంలో చురుకుగా ఉండి సంచరిస్తాయి. ఈ గబ్బిలలను ఆహారంగా తినే దేశాలు ఉన్నాయి. అంతేకాదు వీటి వలన కొన్ని రకాల వ్యాధులు వస్తయని నమ్మకం. అయితే ఈ వింత, భయానక జీవిని పూజించే ఒక గ్రామం ఉంది. వినడానికి వింతగా అనిపించినా నమ్మాలి. బీహార్‌లోని వైశాలి జిల్లాలోని సర్సాయి గ్రామ ప్రజలు గబ్బిలాలను దేవతలుగా పూజిస్తారు. ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? తెలుసుకుందాం..
బీహార్‌లోని వైశాలి జిల్లాలోని సర్సాయి గ్రామ ప్రజలు గబ్బిలాలను భక్తితో పూజిస్తారు. గబ్బిలాలను ఈ గ్రామ ప్రజలు లక్ష్మీదేవి చిహ్నంగా పూజిస్తారు. గ్రామస్తులు గబ్బిలాలను అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ గబ్బిలాలు ఎల్లప్పుడూ తమను రక్షిస్తాయని చెబుతారు. అందువల్ల ఇవి చెడు శకునాల నుంచి తమను రక్షించే దైవిక దూతలని గ్రామస్తులు నమ్ముతారు. ఈ గ్రామ ప్రజలు లక్ష్మీదేవి స్వరూపమని నమ్ముతున్నందున ఇప్పటివరకు తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రాలేదని ఆ గ్రామస్తులు చెబుతారు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం, వేడుకకైనా ఈ గబ్బిలాలు తప్పనిసరిగా ఉండాలని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల శుభకార్యాలు జరిగినప్పుడు గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యాలు సమర్పిస్తారు.
గబ్బిలాలను పూజించే ఆచారం మధ్య యుగాలలో ఉద్భవించిందని చెబుతారు. మధ్య యుగాలలో ఈ గ్రామంలోని ప్రజలు ఒక అంటువ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమయంలో గబ్బిలాలు గ్రామంలోకి వచ్చాయి. ఈ గబ్బిలాలు వచ్చిన తర్వాత ఈ అంటువ్యాధి నిర్మూలించబడిందని చెబుతారు. అప్పటి నుంచి గబ్బిలాలు తమని రక్షిస్తాయనే నమ్మకంతో పూజిస్తున్నారు. నేటికీ గ్రామంలో గబ్బిలం ఒక దైవంగా పూజలను అందుకుంటూనే ఉంది.
నమ్మడం కష్టం.. కానీ సర్సాయి గ్రామంలో సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతంలో దాదాపు 50,000 గబ్బిలాలు కనిపిస్తాయి. అవి ఇక్కడి పాత సరస్సు దగ్గర రావి, మర్రి, బడువా చెట్లలో నివసిస్తాయి. పర్యాటకులు ఈ గబ్బిలాలను చూడటానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇక్కడి చుట్టూ ఉన్న వాతావరణం గబ్బిలాలకు నివాస స్థలం. ఇక్కడి ప్రజల ఈ నమ్మకం గబ్బిలాల సంతానోత్పత్తికి పెంచేందుకు కూడా దారితీసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.